విష జ్వరాల విజృంభణ

విష జ్వరాల విజృంభణ
  • పల్లెటూరు, పట్నం తేడా లేకుండా జ్వర బాధితులు
  • ఇప్పటివరకు 75 డెంగ్యూ కేసులు నమోదు 
  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజూ 
  • వేల మందికి చికిత్స
  • ఖమ్మం ఆస్పత్రిలో రోజుకు 1200 మందికి పైగా ఓపీ నమోదు 

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.  ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఆస్పత్రులకు జ్వర లక్షణాలతో జనం క్యూ కడుతున్నారు.  ఇటీవల వర్షాలతో ఖాళీ స్థలాలు, ప్లాట్లు నీళ్లు నిండి మురుగుకూపాలుగా మారడంతో దోమలు తయారై జ్వరాలు వ్యాపిస్తున్నాయి.  వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాపించి, వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయి.

  కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే, క్రమంగా ఇంటిల్లిపాదికి వ్యాప్తి చెందుతున్నాయి. తీవ్రమైన జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, డయేరియా, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, పిల్లలు 50 ఏళ్లకు పైబడి వయసున్న వారు ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు.  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 75 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. 

పెరుగుతున్న డెంగ్యూ కేసులు

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులకు సంబంధించి ఈ సీజన్​ లో ఇప్పటి వరకు 6,313 మంది డెంగ్యూ అనుమానితులకి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇందులో 75 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో 10, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్​ మండలాల పరిధిలో 9 చొప్పున, తల్లాడలో 7 డెంగ్యూ కేసులు వచ్చాయి. గతేడాది తిరుమలాయపాలెం మండలంలోనే 55 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఈ సారి కూడా ఆ మండలంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇవి కాకుండా రోజూ వందల సంఖ్యలో వైరల్ ఫీవర్​ కేసులు నమోదవుతున్నాయి. జులై నెల నుంచి జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అలర్టై పీహెచ్​సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల వారీగా రెండు విడతలుగా ఫీవర్​ సర్వే నిర్వహించారు.

 ఆశాలు, ఏఎన్​ఎంలు ఇంటింటికీ వెళ్లి అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ తీసుకొని, మందులు పంపిణీ చేశారు.  పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించారు.  జులై 8 నుంచి 24 వరకు మొదటి విడత, జులై 28 నుంచి ఆగస్టు 14  వరకు రెండో విడత ఫీవర్ సర్వే చేశారు.  ఇప్పటి వరకు 1480 మంది జ్వర బాధితులను గుర్తించారు. మరో వైపు వైరల్ ఫీవర్లతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకు కొన్ని వేల మంది చికిత్స పొందుతున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు గత నెల వరకు రోజుకు వెయ్యి మంది వరకు ఓపీ నమోదవుతుంటే, ఈ నెలలో రోజుకు యావరేజీగా 1200కు పైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఈ నెల 4వ తేదీన అత్యధికంగా 1620 మంది, 11న 1530 మంది, 12, 13 తేదీల్లో రోజుకు 1400 మంది చొప్పున ఓపీ నమోదైంది. మరోవైపు అధికారులు మాత్రం పెరుగుతున్న వైరల్ ఫీవర్లు, డెంగ్యూ జ్వరాల కేసులపై అప్రమత్తంగా ఉన్నామని చెబుతున్నారు. ఫ్రైడే, డ్రైడే వంటి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, జ్వరాలు వ్యాప్తి చెందకుండా ప్రయత్నిస్తున్నామని వివరిస్తున్నారు. ఇప్పటికే కేసులు నమోదైన కేసులను బట్టి 90 ప్రాంతాలను హైరిస్క్​ జోన్లుగా గుర్తించి, కేసులు నమోదైన ఇండ్లకు సమీపంలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామంటున్నారు.