ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా పరిధిలో ఎంపిక చేసిన 9 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా అభివృద్ధి చేసేందుకు డిజైన్స్ సిద్ధం చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పై శుక్రవారం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 9 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ప్రస్తుత విద్యార్థుల సంఖ్య ఆధారంగా 1000, 800 మంది విద్యార్థులకు అవసరమైన తరగతి గదులను, మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళిక చేయాలన్నారు. 9 పాఠశాలల లే ఔట్లను పరిశీలించి జీ+1 పద్ధతిలో అదనపు తరగతి గదులు, ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం, సంప్, కిచెన్, వాష్ రూం, ఇతర వసతుల కల్పనకు ప్లాన్ ను సిద్ధం చేయాలన్నారు.
స్కూల్స్ అభివృద్ధి కోసం నిధులు నాబార్డ్ నుంచి వస్తాయని, నాబార్డ్ గైడ్ లైన్స్ కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. తర్వాత ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో హెచ్ జీ ఇన్ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీ తరపున కాంట్రాక్ కార్మికుడిగా పనిచేస్తున్న పరవేశ్ అనే కార్మికుడు విధి నిర్వహణలో గతేడాది జులై 30న జరిగిన ప్రమాదంలో కుడి చేతిని కోల్పోయాడు.
దీంతో సంబంధిత సంస్థకు నోటీసు జారీ చేయగా, యాజమాన్యం నష్టపరిహార చట్టం కింద రూ.31,31,000 డిపాజిట్ చేసింది. బాధిత కార్మికుడికి కలెక్టర్ నష్టపరిహారం చెక్కు అందజేసి, అనంతరం అతడి బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా జమ చేశారు. అనంతరం నగరంలోని ఎన్ ఎస్ పీ రోడ్ లోని బాలల సదనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.
