మన ఇసుక వాహనం యాప్ ప్రారంభం : ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మన ఇసుక వాహనం యాప్ ప్రారంభం : ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు: మన ఇసుక వాహనం మొబైల్​యాప్​ను ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి సోమవారం అడిషనల్​కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్​ వచ్చే నెల 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. దీని ద్వారా అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జిల్లా ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని డిపార్ట్​మెంట్లు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. 

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు పక్కగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం అంతర్జాతీయ జీరో వేస్ట్​ డే పోస్టర్​ను ఆవిష్కరించారు. 

ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాల్లో 1594 మంది అభ్యర్థులకు ఓపెన్ 10వ తరగతి పరీక్షలు, 1755 మంది అభ్యర్థులకు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు ప్రజల నుంచి అర్జీలను  స్వీకరించారు.