కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి : సునీల్ దత్

కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి : సునీల్ దత్
  • నేర సమీక్షలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు: మాదకద్రవ్యాలు, పొక్సో కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. సోమవారం పోలీస్ వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్షలో పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైరా, కల్లూరు డివిజన్ పరిధిలో గుర్తించిన బ్లాక్‌‌‌‌ స్పాట్లలో బ్యారికేడింగ్‌‌‌‌, ప్రమాద సంకేత సూచిక బోర్డులు, స్టాపర్స్‌‌‌‌,సిగ్నల్ లైట్స్‌‌‌‌, బ్లింకింగ్‌‌‌‌ లైట్స్‌‌‌‌ ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని  తెలిపారు. 

డ్రంకన్ అండ్ డ్రవ్ తనిఖీ ముమ్మరం చేయాలని ఆదేశించారు.  జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు  కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల సరఫరా చేసే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సమావేశంలో సిసిఆర్బి ఇన్స్పెక్టర్ స్వామి, ఎసై రవి, సత్యనారాయణ పాల్గొన్నారు. 

ఫోరెన్సిక్​ మొబైల్​ ల్యాబ్​ వ్యాన్ ప్రారంభం

నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి తక్షణమే పరీక్షలు నిర్వహించేందుకు ఫోరెన్సిక్​ సైన్స్​ లాబొరేటరీ మొబైల్​ ల్యాబ్​ వ్యాన్​ఉపయోగపడుతుందని ఖమ్మం సీపీ సునీల్​ దత్​ అన్నారు. సోమవారం ఆయన ఖమ్మం ఓల్డ్​ డీపీఆర్వో ఆఫీస్​ వద్ద ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్ ను ప్రారంభించారు. అంతకుముందు ఖమ్మం సిటీలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. 

ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, సీసీటీ ఎన్ఎస్ అప్లోడ్, జనరల్‌‌‌‌ డైరీ రికార్డులు, నమోదైన కేసులు, పెండింగ్​ కేసుల వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, పోలీసు సిబ్బంది, డాక్టర్ వి.నాగలక్ష్మి, కె. సుధాకర్, కె.నరసింహ, ఆర్ఐ కామరాజు, శ్రీశైలం, సురేశ్, నాగులుమీరా తదితరులు పాల్గొన్నారు.