
- కొత్త ఏడాదికి ప్రారంభం..!
- 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ఏర్పాటు
- ఉమ్మడి జిల్లా పరిధిలో 105 కిలోమీటర్ల హైవే
- మొత్తం 124 బ్రిడ్జిలు, అండర్ పాస్‌ల నిర్మాణం
- ప్రధాన అడ్డంకిగా రైల్వే ఓవర్ బ్రిడ్జి, హెచ్‌టీ లైన్ మార్పు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం, దేవరపల్లి జాతీయ రహదారి కొత్త ఏడాది నాటికి ప్రారంభానికి సిద్ధమవుతోంది. పెండింగ్ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసి, నవంబర్ నెలాఖరు నాటికి ఒకవైపు నుంచి అయినా వాహనాల రాకపోకలను అనుమతించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కొత్త సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ వెళ్లేందుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లకుండా, ఖమ్మం మీదుగా ప్రయాణిస్తే గంటన్నరలోనే ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లవచ్చు. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీని కలుపుతూ 162 కిలోమీటర్ల మేర రూ.4054 కోట్లతో ఈ హైవేను 5 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఇందులో ఖమ్మం జిల్లాలో మూడు ప్యాకేజీలున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మీదుగా వందనం సమీపంలో నాగపూర్, అమరావతి హైవే వెళ్తుంది. ఇక్కడ రెండు హైవేల అనుసంధానానికి క్లోవర్ లీఫ్ ఇంటర్ ఛేంజ్ నిర్మించనున్నారు.
ధంసలాపురం ఎగ్జిట్ పనులతో ఆలస్యం!
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్ణయించిన సమయంలో ధంసలాపురం ఎగ్జిట్ లేదు. గతేడాది మధిర నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి, స్థానికుల ఆందోళన మేరకు ధంసలాపురం ఎగ్జిట్ ను మంజూరు చేశారు. ఈ డిజైన్లు ఆలస్యం కావడంతో మొత్తం ప్రాజెక్టు ఆలస్యమైంది. దీనికి తోడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా లేట్ కావడం, కొదుమూరు సమీపంలో హై టెన్షన్ విద్యుత్ లైన్ల మార్పు లాంటి అడ్డంకులతో నెమ్మదిగా పనులు జరుగుతున్నాయి. నవంబర్ నెలాఖరు నాటికి ఆర్వోబీ పనులను ఒకవైపు పూర్తి చేసి, రాకపోకలను అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త ఏడాది నాటికి రెండు వైపులా నిర్మాణాన్ని పూర్త చేయనున్నారు.
ఈ గ్రీన్ ఫీల్డ్ లో మొత్తం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రధాన రహదారులు, పెద్ద గ్రామాలు, పట్టణాలు ఉన్న చోట్ల 8 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు ఎక్కడంటే అక్కడ హైవే పైకి ఎక్కేందుకు వీలుండదు. ఈ జాతీయ రహదారి పైకి ఎలాంటి పశువులు, జంతువులు రాకుండా, యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ల దగ్గర వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు రెస్ట్ తీసుకునేందుకు 6 ట్రక్ లేలు సిద్ధం చేస్తున్నారు. డొంకదారులు, అంతర్గత రహదారుల దగ్గర అండర్ పాస్ లు, సాగునీటి కాల్వల దగ్గర అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ రహదారికి సర్వీస్ రోడ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.
కొత్త సంవత్సరం కానుకను అందిస్తాం
గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుంది. రవాణా వ్యవస్థ మెరుగవుతుంది. హైవేపై కొత్త ఏడాదిలో వాహనాల ప్రయాణాలు పూర్తి స్థాయిలో జరుగుతాయి. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా అధికారులను ఆదేశించాం. ఎగ్జిట్ పనులతో పాటు మున్నేరు బ్రిడ్జి, రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నవంబర్ వరకు పూర్తవుతాయి.– తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
ప్యాకేజీ పొడవు (కి.మీ.) నిధులు (రూ.కోట్లలో)
1. తల్లంపాడు నుంచి సోమవరం 33.60 1063
2. సోమవరం నుంచి చింతగూడెం 29.51 761.73
3. చింతగూడెం నుంచి రేచర్ల 42.11 948.64
4 .రేచర్ల నుంచి గురవాయిగూడెం 27.41 569.37
5.గురవాయిగూడెం నుంచి దేవరపల్లి 29.46 711.94