ఎకరానికి 14 లక్షలు.. ఆగ్రహించిన రైతులు.. 23 లక్షలకు ఫైనల్

ఎకరానికి 14 లక్షలు.. ఆగ్రహించిన రైతులు.. 23 లక్షలకు ఫైనల్
  •   గ్రీన్​ఫీల్డ్​ హైవే అవార్డ్​ ఎంక్వైరీలో ఆఫీసర్లు
  •   కార్యక్రమానికి వస్తున్న రైతుల అరెస్టు.. విడుదల

సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో నేషనల్​ గ్రీన్​ఫీల్డ్​ హైవేలో కోల్పోతున్న భూములకు గరిష్ఠంగా రూ. 23 లక్షలు ధర నిర్ణయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గడిచిన పదేళ్లకుగాను ప్రతి మూడేళ్లకు మార్కెట్​ధరను రివైజ్​చేస్తూ వేసిన లెక్కల ప్రకారం ఈ ధర నిర్ణయించామన్నారు. ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కలెక్టర్​ వద్ద అప్పీల్​ చేసుకోవాలని సూచించారు. నేషనల్ ​గ్రీన్​ఫీల్డ్​హైవే భూసేకరణ నష్ట పరిహార అవార్డ్​ ఎంక్వైరీ బుధవారం సత్తుపల్లి తహశీల్దార్​ఆఫీస్​లో నిర్వహించారు. కార్యక్రమానికి రైతుల ప్రతినిధిగా తల్లాడ మండలం నుంచి వస్తున్న అడ్వకేట్ ​రాజశేఖర రెడ్డి సహా మరో ఐదుగురు రైతులను కల్లూరు పోలీసులు సుమారు 4 గంటలపాటు నిర్బంధించారు. దీంతో సత్తుపల్లి పోలీస్​స్టేషన్​ఎదుట హైవేపై రైతులు అఖిలపక్ష పార్టీల నాయకుల మద్దతుతో  రాస్తారోకో చేశారు. రాస్తారోకోలో తుంబూరు గ్రామానికి చెందిన ఓ యువ రైతు పెట్రోల్​డబ్బా తీయగానే గుర్తించిన పోలీసులు నిలువరించారు. ఆర్డీవో వారితో మాట్లాడేందుకు రాగా రైతులు ఆయన కాళ్లు పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అరెస్ట్​ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రాధేయపడ్డారు.

ఎకరానికి రూ. 14.94 లక్షలిస్తామంటూ..

రాస్తారోకో ముగించి జేసీతో చర్చలకు రావాలంటూ సీఐ రమాకాంత్​ కోరారు. కొందరు రైతులు జేసీతో మాట్లాడగా అరెస్ట్​ చేసిన రైతులను వెంటనే విడుదల చేశారు. అనంతరం రైతులతో అవార్డ్​ఎంక్వైరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్​ మధుసూదనరావు మాట్లాడుతూ రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం రోడ్డు వెడల్పును 70 మీటర్ల నుంచి 60 మీటర్లకు కుదించినట్లు చెప్పారు. ధరను నిర్ణయించే విధానాలను వివరిస్తూ మార్కెట్​రేటు ప్రకారమైతే రూ.9 లక్షలు, రిజిస్ర్టేషన్​వాల్యూ ప్రకారం రూ.14.94 లక్షలు ఇవ్వగలమని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఖమ్మం కొత్త కలెక్టరేట్​ నిర్మాణానికి ఏ విధంగా పరిహారం చెల్లించారో తమకు కూడా అదేవిధంగా చెల్లించాలని కోరారు. చివరకు గరిష్ఠంగా ఎకరానికి రూ. 23 లక్షలు చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలోనే ధర నిర్ణయించాలె

70 శాతం మంది రైతుల ఆమోదంతో మాత్రమే భూసేకరణ చేపట్టాలి. కానీ రైతులంతా వ్యతిరేకిస్తుంటే ఎలా భూసేకరణ చేస్తారు. 8 గ్రామ పంచాయతీలు హైవే వద్దంటూ తీర్మానాలు కూడా చేశాయి. అభిప్రాయాలు తెలిపేందుకు వస్తున్న రైతులను నిర్బంధించడంలో ఆంతర్యమేమిటి. ఏకపక్ష సర్వేలతో 3ఏ, 3జీ, అవార్డ్​ఎంక్వైరీ నోటిఫికేషన్​లు తప్పులతడకగా ఉంటే.. అవి సరిచేయకుండానే ముందడుగు ఎలా వేస్తారు. స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే ధరను నిర్ణయించాలి.

– రాజశేఖర్​రెడ్డి, అడ్వకేట్, బాధిత రైతు