ఖమ్మం గ్రానెట్ ఇండస్ట్రీకి కష్టాలు: ప్రభుత్వం పట్టించుకుంటలేదు

ఖమ్మం గ్రానెట్ ఇండస్ట్రీకి కష్టాలు: ప్రభుత్వం పట్టించుకుంటలేదు

గ్రానైట్  పరిశ్రమను కష్టాలు వెంటాడుతున్నాయి. వందలాది ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. కొన్ని పరిశ్రమలు పొద్దున నడిస్తే… రాత్రి బంద్ అవుతున్నాయి.  దీంతో  వేలాది  మంది  గ్రానైట్  కార్మికులు  రోడ్డున  పడుతున్నారు.  ఎన్ని  సార్లు  విన్నవించినా  సర్కార్  పట్టించుకోవడం  లేదని ఆవేదన  వ్యక్తం  చేస్తున్నారు కార్మికులు.

ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ఇండస్ట్రీని కష్టాలు వెంటాడుతున్నాయి. వైఎస్ హయాంలో గ్రానైట్ రంగానికి రాయల్టీలో 40శాతం రాయితీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనిని యధావిధిగా కొనసాగిస్తున్నారు. తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత.. జీవో జారీ చేసారు. అయితే ఈ జీఓ గడువు గతనెల 25తో పూర్తయింది. తిరిగి జీఓను కొనసాగించేలా ఉత్తర్వులు రాకపోవటంతో.. వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి తర్వాత అంతస్థాయిలో ఉపాధిని కల్పించి.. 550కి పైగా స్లాట్ ఫ్యాక్టరీలు, 200కు పైగా టైల్డ్ పరిశ్రమలను కలిగిన ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ, ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమౌతోంది.

ఇక్కడి నాణ్యమైన ముడిసరును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండటంతో.. మన పరిశ్రమలకు నాసిరకం ముడిసరుకు మాత్రమే లభ్యమౌతోంది. పరిశ్రమలను మూతపెట్టలేక.. నాసిరకం ముడి సరుకును ప్రాసెస్ చేసి మార్కెట్ చేసినా అమ్ముడుపోక.. నష్టపోతున్నారు వ్యాపారులు. మరోవైపు 18శాతం GST తో కొనుగోలు చేసేందుకు బయ్యర్లు హడలిపోతున్నారు. రోజూ పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా క్వారీలో ముడిసరుకు రేట్లు పెంచుతున్నారు. దీంతో 100కు  పైగా స్లాట్ పరిశ్రమలు, 70కి పైగా టైల్డ్ పరిశ్రమలు మూతపడ్డాయి. ఉన్న పరిశ్రమలు కూడా పగలు నడిపితే రాత్రి నడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రియలిస్టులు.

రాయల్టీ మీద ఉన్న 40 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం తొలగించటంతో.. ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ కోలుకోని పరిస్థితుల్లో ఉంది. ఇదేకాక గత ఐదేళ్ల నుంచి ఖమ్మం గ్రానైట్ పరిశ్రమకు రావాల్సిన వివిధ రకాల రాయితీలను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో పరిశ్రమలు బ్యాంకులకు కట్టాల్సిన కిస్తీలు కట్టలేక NPA లో పడ్డాయి. ఒక వైపు బ్యాంకుల ఒత్తిడి, మరోవైపు ముడిసరుకు కొరత, ఇంకోవైపు ఆర్థిక మాంద్యంతో.. గ్రానైట్ పరిశ్రమ శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందంటున్నారు పారిశ్రామికవేత్తలు.

చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమలను ఆదాయ వనరులుగా భావించకుండా.. ఉపాధి కల్పన పరిశ్రమలుగా గుర్తించి మైనింగ్ రాయల్టీని పూర్తిగా ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పారిశ్రామకవేత్తలు. గ్రానైట్ పై ఉన్న రాయల్టీని ఎత్తివేసి .. రావాల్సిన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలంటున్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు. కొత్త క్వారీలకు అనుమతులు మంజూరు చేసి..  రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేపట్టే నిర్మాణాల్లో గ్రానైట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని కోరుతున్నారు పారిశ్రామికవేత్తలు.

గ్రానైట్ పరిశ్రమలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీ సౌకర్యాన్ని కల్పించి రాయితీలు ఇచ్చిందంటున్నారు వ్యాపారులు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు విడుదల కావడంలేదంటున్నారు. బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో.. వ్యాపారులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యలపై ఇప్పుటికే చాలాసార్లు సీఎంను కలిసి విన్నవించామని చెబుతున్నారు ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారులు. ప్రభుత్వం స్పందించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు.