ట్యాపింగ్ ఉచ్చులో ఖమ్మం పోలీసులు

ట్యాపింగ్ ఉచ్చులో ఖమ్మం పోలీసులు
  •     రిటైర్డ్‌‌ పోలీస్‌‌ ఆఫీసర్‌‌, కొందరు సీఐలపైనా ఆరోపణలు
  •     తుమ్మలపై దాడికి ఇక్కడే ప్లాన్‌‌ ?

ఖమ్మం, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ ఇష్యూలో ఖమ్మం పోలీసుల పాత్రపై తీవ్ర చర్చ జరుగుతోంది. వాలంటరీ రిటైర్మెంట్‌‌ తీసుకున్న ఓ పోలీస్‌‌ అధికారిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఓ మామిడి తోటలోని గెస్ట్‌‌హౌజ్‌‌లో వార్‌‌ రూమ్‌‌ను ఏర్పాటు చేసి ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు పాల్పడ్డారని రెండు వారాల కింద వెలుగులోకి వచ్చింది.

 ఆ తర్వాత హైదరాబాద్‌‌ నుంచి వచ్చిన, ప్రత్యేక దర్యాప్తు బృందానికి చెందిన ఐదుగురు సభ్యులు ఆ గెస్ట్‌‌హౌజ్‌‌ను పరిశీలించారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఎన్నికలకు ముందు ఖమ్మం కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి కూడా ఇదే మామిడితోటలో కుట్ర జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడు పోలీస్‌‌ ఆఫీసర్‌‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఎన్నికలకు ముందు రాజీనామా చేసి అప్పటి మంత్రికి సంబంధించిన ఎలక్షన్‌‌ క్యాంపెయినింగ్‌‌లో కీలకంగా వ్యవహరించడంతో ఆయన పాత్ర వివాదాస్పదంగా మారింది.

 డ్యూటీలో ఉన్న టైంలో కింది స్థాయి సిబ్బందిని, ఇన్స్‌‌పెక్టర్లను ప్రత్యర్థి పార్టీలను అణిచివేసేందుకే ఉపయోగించారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఓటర్లకు పంచేందుకు అవసరమైన డబ్బును సైతం ఆయన ఇంట్లోనే నిల్వ చేశారని కాంగ్రెస్ నేతలు గొడవ కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ తుమ్మలపై దాడి యత్నం, కుట్ర చేశారంటూ బయటకు రావడంతో ఖాకీల ముసుగులో ఎన్నికల ముందు జరిగిన ఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

రాజకీయంగానూ రచ్చ

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు కేంద్రంగా మారిన మామిడితోటలోనే తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి కుట్ర పన్నారని వెలుగులోకి రావడంతో కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని కొందరు ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని, వారిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని కాంగ్రెస్‌‌ లీడర్లు డిమాండ్‌‌ చేస్తున్నారు. దాడికి ప్లాన్‌‌ చేశారా ? లేక హత్యకు కుట్ర చేశారా ? అని సమగ్ర దర్యాప్తు చేయాలని, అసలు సూత్రధారులను గుర్తించాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌‌ కోరారు. అయితే దీనిని బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ఖండిస్తున్నారు. 

ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే కుట్రకు సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్‌‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌‌ ఫెయిల్‌‌ అవడం వల్లే, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్‌‌ లీడర్లు ఎదురుదాడి చేస్తున్నారు. అసలు నేలకొండపల్లి మామిడితోటలో ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు సంబంధించిన ఆధారాలు లభించాయా ? దాడి యత్నం, హత్యకు కుట్ర వంటి ప్రచారాల్లో ఏది నిజమో తేల్చాలని నేతలు డిమాండ్‌‌ చేస్తున్నారు.