
- 15 ఫీట్ల ఎత్తులో వరద
- క్రమంగా పెరుగుతున్న ఆకేరు, మున్నేరు ప్రవాహం
- ఖమ్మం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశం
- కామేపల్లి, కారేపల్లి మండలాల్లో బుగ్గవాగు ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో మున్నేరు ముంపు ముప్పు భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మున్నేరు ఇప్పటికే కాల్వొడ్డు సమీపంలో 15 అడుగుల మేర ప్రవహిస్తుండగా, ప్రస్తుతం 65 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆకేరుకు వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్, ఖమ్మం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో, ఆకేరు వరదతో పాటు మున్నేరు వరద తీవ్రత పెరుగుతుందన్న అంచనాలున్నాయి.
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చెరువులు, వాగులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పాలేరు, వైరా రిజర్వాయర్లు ఇప్పటికే వారం రోజుల నుంచి అలుగుపోస్తున్నాయి. లంకాసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 16 ఫీట్లకు గాను 14.09 అడుగులకు చేరింది. జిల్లాలో 1061 చెరువులకు గాను 326 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. 222 చెరువులు 100 శాతం వరకు నిండాయి. 205 చెరువులు 90 శాతం వరకు, 135 చెరువులు 75 శాతం వరకు నిండాయి.
అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి తుమ్మల
క్రమంగా మున్నేరు వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అలర్ట్ గా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఫోన్ ద్వారా ఆయన ఖమ్మం కలెక్టర్ అనుదీప్, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. మున్నేరుకు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల వరద ముప్పు పొంచి ఉందని చెప్పారు. రాత్రి వేళ వరద పెరిగే చాన్స్ ఉండడం వల్ల ముందుగానే ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని12 డివిజన్లలో ప్రజలకు సహాయం అందించాలని ఆదేశించారు.
ఉప్పొంగుతున్న వాగులు
కారేపల్లి మండలంలోని పేరుపల్లి, మాదారం రోడ్డులో లో లెవెల్ వంతెనపై బుగ్గ వాగు వరద నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. పేరుపల్లి గ్రామ శివారులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని వరద నీరు చేరడంతో స్థానికులను అధికారులు వరద సహాయక కేంద్రాలకు తరలించారు.
కామేపల్లి మండలం బండిపాడు వద్ద బుగ్గవాగు పొంగి ప్రవహించడంతో ఖమ్మం, మహబూబాద్ జిల్లాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వైరాలో చెరువు సమీపంలో ఉన్న రాజీవ్ నగర్ లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులకు ముందుగానే అక్కడి అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వైరా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వైరా ఏసీపీ రహమాన్ సందర్శించి, బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఉప్పొంగిన వాగులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వాతావరణ శాఖ జిల్లాను శనివారం రెడ్ అలర్డ్ జాబితాలో ప్రకటించింది. ఆఫీసర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి ప్రకృతి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో రాత్రంతా కురిసిన వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులలకు అలుగులు పడ్డాయి. ఇల్లెందు మండలంలోని జెండాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇల్లెందు–మహబూబాబాద్ మధ్య కొంత సేపు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇల్లెందుల పాడు మంచినీటి చెరువు అలుగు నుంచి ఉధృతంగా వస్తున్న వరద నీటితో ఒకటో వార్డు, మూడో వార్డుల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జూలూరుపాడు మండలంలో తుమ్మల వాగు పొంగడంతో నర్సాపురం–బేతాళపాడు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గుండాల మండలంలోని ఏడు మెలికల వాగు ఉప్పొంగండంతో ఆరు గిరిజన గ్రామాలకు రాకపోకలు ఆగాయి.
సుజాతనగర్లోని సింగభూపాలం చెరువు, టేకులపల్లి మండలంలో రామచంద్రుని పేటలోని మురుట్ల చెరువుతో పాటు సాయమ్మ చెరువు, తెల్లవాగు చెరువులు అలుగు పడి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్ద వాగు, రాళ్లవాగు, ముర్రేడు వాగు, తెల్లవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.