రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీల విజేతగా ఖమ్మం.. రన్నరప్ గా వరంగల్, పాలమూరు

రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీల విజేతగా ఖమ్మం.. రన్నరప్ గా వరంగల్, పాలమూరు
  • బాల, బాలికల విభాగాల్లోనూ కైవసం 

తొర్రూరు, వెలుగు : మూడు రోజులపాటు ఉత్సాహంగా,  ఉత్కంఠగా కొనసాగిన రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలు సోమవారం ముగిశాయి.  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో 69వ అండర్- –19 నెట్ బాల్ రాష్ట్రస్థాయి క్రీడలు మహబూబాబాద్​జిల్లా తొర్రూరు మండలం గుర్తురు గ్రామ ఆదర్శ పాఠశాలలో జరిగాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి జట్లు పాల్గొనగా హోరా హోరీగా సాగాయి. బాలుర, బాలికల విభాగాల్లో  ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. 

ఫైనల్ మ్యాచ్ లో బాలుర విభాగంలో మహబూబ్ నగర్ పై ఖమ్మం 14 –-15 పాయింట్లతో విజయం సాధించింది. మూడో స్థానానికి హైదరాబాద్,  వరంగల్ జట్లు తలపడగా, హైదరాబాద్15 –-14 స్కోరుతో కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో వరంగల్ జట్టుపై ఖమ్మం 16-–10 స్కోర్ తో ఆధిక్యం కనబరిచి ప్రథమ స్థానంలో, వరంగల్ రన్నరప్ గా నిలిచింది. నిజామాబాద్ పై మెదక్ 5–-9 స్కోరుతో మూడో స్థానం సాధించింది. 

అనంతరం ఆదర్శ పాఠశాలలో నిర్వహించి బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు ఎంఈఓ ఎం. బుచ్చయ్య,  ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడలు స్నేహ సంబంధాలను మెరుగుపరచడానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని, విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని వక్తలు పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎస్ జీఎఫ్ ఐ పరిశీలకులు సమ్మయ్య, కో – ఆర్డినేటర్ పీవీ రమణ పాల్గొన్నారు.