- అధికారికంగా ప్రారంభించిన తర్వాతే మళ్లీ అనుమతి
- సంక్రాంతి రద్దీతో మొన్నటి వరకు రాకపోకలు
- రెండు వారాలుగా 120 కిలోమీటర్ల మేర అనుమతి
- ఓవర్ స్పీడ్, పొగమంచు కారణంగా ప్రమాదాలు
- ప్రస్తుతం హైవే పనులకు మాత్రమే పర్మిషన్
ఖమ్మం, వెలుగు : ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలకు బ్రేక్‌పడింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు తాత్కాలికంగా ఈ హైవేపై వాహనాలను అనుమతించారు. వందనం నుంచి దాదాపు 120 కిలోమీటర్ల మేర వాహనాలు ప్రయాణించేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ లను ఓపెన్ చేశారు. దీంతో పండుగకు ముందు ఏపీకి వెళ్లిన వారు, ఆ తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేనే ఉపయోగించుకున్నారు.
కానీ ఇటీవల వరుస ప్రమాదాలతో ఆఫీసర్లు ఈ హైవేపై రాకపోకలను నిలిపివేశారు. నిర్మాణ పనుల కోసం సామగ్రి వాహనాలను తప్పించి, ఇతర వెహికల్స్ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. హైవేపై ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను బారికేడ్లతో మూసివేశారు. వాహనదారులు వాటిని ఈజీగా తొలగించకుండా ఉండేందుకు క్రాష్ బ్యారియర్స్‌ను కూడా పెట్టారు. పెండింగ్ పనులన్నీ పూర్తయిన తర్వాత, అధికారికంగా ప్రారంభించాకనే ఇకపై వెహికల్స్ కు అనుమతినిస్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు.
అసలు టూ వీలర్లకు పర్మిషనే లేదు.. కానీ..!
సంక్రాంతి పండుగ ముందు నుంచి దాదాపు రెండు వారాల పాటు వైరా నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెం వరకు దాదాపు 120 కిలోమీటర్ల మేర వాహనాలకు ఆఫీసర్లు అనుమతినిచ్చారు. ఈనెల 16న తల్లాడ మండల పరిధిలో ఒక లారీని మూడు కార్లు ఒకదాని తర్వాత మరొకటి ఢీకొనగా, అదే రోజు వైరా మండల పరిధిలో రెండు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఎనిమిది మంది గాయపడ్డారు.
వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి పండుగను ముగించుకొని ఏపీ నుంచి హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్న సమయంలో పొగ మంచు కారణంగా ఈ ప్రమాదాలు జరిగాయి. ఈనెల 23న ఓ టూవీలర్ మీద ఇద్దరు యువకులు చింతలపూడి నుంచి ఖమ్మం వస్తుండగా కల్లూరు మండలంలో రెయిలింగ్ ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు. ఓవర్ స్పీడ్ తో బైక్ కంట్రోల్ కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
వాస్తవానికి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేపై టూవీలర్లకు అనుమతి లేదు. యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కావడం వల్ల కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, పెద్ద వాహనాలకే అనుమతి ఉంటుంది. టూవీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లను కూడా అనుమతించరు. ప్రస్తుతం అధికారికంగా ప్రారంభం కాకపోవడం, కేవలం తాత్కాలికంగా అనుమతినివ్వడంతో బైక్ పై హైవేపైకి వచ్చి వారు ప్రాణాలను కోల్పోయారు.
ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంతోనే..
ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం 162 కిలోమీటర్లు ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ లో మొత్తం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రధాన రహదారులు, పెద్ద గ్రామాలు, పట్టణాలు ఉన్న చోట్ల 8 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హైవేపై నిబంధనల ప్రకారం గరిష్ఠ వేగం గంటకు 100 కిలోమీటర్లు కాగా, ఇటీవల ప్రమాదాలు జరిగిన అన్ని వాహనాలు 120కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో ప్రయాణిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైవేపై ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, హైవే ప్రారంభం నాటికి స్పీడ్ గన్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఓవర్ స్పీడ్ గా వెళ్తే ఆటోమెటిక్ గా ఫొటో తీసి, చలానా జనరేట్ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం స్పీడ్ లిమిట్ లేకపోవడంతో ఓవర్ స్పీడ్ గా వాహనాలు వెళ్లడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఇప్పుడు వాహనాలనే నిలిపివేశారు. ఖమ్మంలో ధంసలాపురం ఎగ్జిట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేరు బ్రిడ్జి దగ్గర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మరో ఒకట్రెండు నెలల్లో ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతే అధికారికంగా హైవేనే ప్రారంభించనున్నారు. హైవే నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ వెళ్లేందుకు ప్రయాణ సమయం గంటన్నరకు పైగా తగ్గనుంది.
