
అలియా భట్ గంగుబాయ్ కథియావాడిగా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే గంగూబాయ్ ట్రైలర్ చూసినవాళ్లంతా అలియా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని తెగ పొగిడేస్తున్నారు. ఆ మానియా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనూ బాగా కనిపిస్తోంది. చాలామంది గంగూబాయ్ పవర్ఫుల్ డైలాగ్స్‌ని సేమ్ టు సేమ్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కానీ, వాళ్లందరిలో ఈ చిన్నారి గంగుబాయ్ చాలా స్పెషల్. ఈ చిచ్చరపిడుగు పేరు కియారా ఖన్నా.
తెల్లటి చీర.. నుదిటిపై ఎర్రటి బొట్టు..మెడలో కడియం.. కాకపోతే ఇది గంగూబాయ్ సినిమాలో అలియా కాదు. కానీ, ఈ గెటప్‌లో చిన్నారిని చూసినవాళ్లంతా గంగూబాయ్నే గుర్తుచేసుకుంటున్నారు. కొందరైతే అలియాని మించి యాక్టింగ్ చేశావంటూ పొగుడుతున్నారు కూడా. అంతలా అలియాని మక్కీ కి మక్కీ దించేసింది ఈ చిన్నారి. ఆమె చెప్తున్న పవర్ఫుల్ గంగూబాయ్ డైలాగ్స్‌కి సెలబ్రిటీలు కూడా సలాం కొడుతున్నారు.
గంగూబాయ్‌గా సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఈ చిన్నారి పూర్తి పేరు కియారా ఖన్నా. వయసు ఐదేండ్లు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా చాలామందికి పరిచయమే. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ చిచ్చరపిడుగుని కొందరు లిటిల్ కియారా అద్వానీ అని కూడా పిలుస్తుంటారు. దానికి కారణం ఈ చిన్నారి కియారా అద్వానీని ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియోలే. ఇంతకుముందు కియారా అద్వానీ ఫేమస్ డైలాగ్స్‌ని, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలామందిని ఇంప్రెస్ చేసింది. మరికొందరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ని కూడా ఇమిటేట్ చేసింది. అలా రీసెంట్గా గంగూబాయ్‌లో అలియా క్యారెక్టర్లో ఒదిగిపోయింది కియారా. గంగూబాయ్ డైలాగ్స్‌ని అంతే పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేసింది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అన్నట్టు ఈ చిన్నారి ఇమిటేషన్స్ చూసి బాలీవుడ్ సెలబ్రిటీలు పిలిచి మరీ సినిమా అవకాశాలు ఇస్తున్నారు కూడా.