మనసుకు హత్తుకునే చిత్రమిది : రవి కిశోర్

మనసుకు హత్తుకునే చిత్రమిది : రవి కిశోర్

తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన ‘స్రవంతి’ రవి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో  ‘దీపావళి’ పేరుతో  నవంబర్ 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవి కిశోర్ మాట్లాడుతూ ‘నా 38ఏళ్ల సినీ ప్రయాణంలో నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తిని ఇచ్చాయి.  ఆర్ధికంగా కాకపోయినా  చేసిన సినిమాల పట్ల  గర్వంగా ఉన్నాను. ఎందుకు చేశాననే ఫీలింగ్ అయితే లేదు.  కథ బాగా నచ్చితేనే ముందడుగు వేస్తా. నమ్మకం కుదరకపోతే సినిమా చేయను. ఎప్పుడూ డబ్బులు గురించి ఆలోచించను. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? లేదా? అని  ఆలోచిస్తా.  

తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. ‘కిడ’ కథను చెన్నైలో ఫ్రెండ్ ద్వారా విన్నాను. దర్శకుడు ఆర్ఏ వెంకట్ బౌండెడ్ స్క్రిప్ట్ రికార్డ్‌‌ చేసి పంపించాడు. ప్రాణం పెట్టి కథ రాసుకున్నాడనిపించింది. నేను  కథ నమ్మి ఇన్వెస్ట్ చేశా.  లాభం ఎంత వస్తుందని ఆలోచించకుండా మంచి సినిమా అవుతుందని నమ్మాను. మనసుకు హత్తుకునే చిత్రమిది. సినిమా చూసిన కొందరు మిత్రులు 'ఫిల్మ్ ఫెస్టివల్స్  లేదా అవార్డులకు ఎందుకు పంపించకూడదు?' అని అడిగారు.

వాళ్ల మాటలతో ఇండియా పనోరమాకు పంపించా. ఒక రోజు సినిమా సెలెక్ట్ అయ్యిందని ఫోన్ వచ్చింది. అదొక గొప్ప అనుభూతి. తర్వాత చెన్నై, గోవా, మెల్ బోర్న్  ఫిల్మ్‌‌ ఫెస్టివల్‌‌లోనూ స్టాండింగ్ ఒవేషన్ వచ్చింది. ప్రీమియర్స్‌‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.  తమిళంలో తీసినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్నాయి. 'బలగం' చూసిన తర్వాత తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. ఇక రామ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌‌లో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉంది’ అని చెప్పారు.