
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం అదృశ్యమైన ఆరేళ్ల పాప ఆచూకీ లభ్యమైంది. పాపను ట్రేస్ చేసిన మహంకాళి పోలీసులు.. సిద్ధిపేటలో ఉన్నట్లు గుర్తించారు. పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తిని సిద్ధిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేట నుంచి పాప కృతికను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. విషయం తెలిసిన కృతిక తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి..తల్లిదండ్రులైన రేణుక, నర్సింహాను పిలిపించి పాపతో వీడియో కాల్ మాట్లాడించారు. పాప కృతికాను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఓ సైకో అని డీసీపీ చందనా దీప్తి చెప్పారు. సైకో రాము మహంకాళి టెంపుల్ నుంచి జేబీఎస్ వరకు పాపను ఆటోలో తీసుకువెళ్లాడన్నారు. రాము స్వగృహం సిద్ధిపేట జిల్లా దూల్ మిట్ట అని అందుకే అక్కడికి తీసుకువెళ్లాడని తెలిపారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో గ్రామ సర్పంచ్ పాపను అడిగి వివరాలు తెలుసుకున్నారని వెల్లడించారు. మొత్తం 10 టీమ్ లతో పాపను గాలించామన్నారు. 365 ఐపీసీతో పాటు 325ఏ, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని డీసీపీ చందనా దీప్తి స్పష్టం చేశారు.
అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారి ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాప కోసం గాలించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అందులో పాప ఓ వ్యక్తి తో వెళ్ళినట్టు కనిపించడంతో అప్రమత్తమయ్యారు. సదరు వ్యక్తిని స్థానిక మెస్ యజమాని రోజువారీ కూలీ కోసం అడ్డా నుంచి తీసుకువచ్చినట్లు తెలిసింది. గంటల వ్యవధిలోనే పాప ఆచూకీని గుర్తించారు.