అమెరికాలో విహారయాత్రకు వెళ్లి గల్లంతైన తెలుగు దంపతుల పిల్లలు సేఫ్గా ఉన్నారు. వీరి కుమార్తెలు ఇద్దరూ అరిజోనాలోని పిల్లల భద్రతా విభాగంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గడ్డకట్టిన సరస్సుపై నడుస్తున్న సమయంలో వీరు కూడా మంచులో పడిపోయారు. వీరిద్దరూ ఒడ్డుకు దగ్గరగా ఉండటంతో అధికారులు సురక్షితంగా రక్షించారు. డిసెంబరు 26న మధ్యాహ్నం అరిజోనాలోని కోకోనినో కౌంటీలోని వుడ్స్ కాన్యన్ లేక్ వద్ద.. పిల్లలతో విహారయాత్రకు వెళ్లిన దంపతులు మంచులో మునిగిపోయి మరణించారు. నారాయణ ముద్దన, గోకుల్ మెడిసేటి, బాధిత మహిళ హరిత ముద్దన మృతదేహాలను అధికారులు వెలికితీశారు.
క్రిస్మస్ వేడుకలు చేసుకున్న తర్వాత పిల్లలతో కలిసి వీరంతా వుడ్స్ కాన్యన్ లేక్ వద్దకు వెళ్లారు. అక్కడ సరస్సు పై నడుస్తున్న సమయంలో మంచులో నుంచి పడిపోయారు. అయితే.. హరితను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు అధికారులు గుర్తించారు. సరస్సులో పడిపోయిన నారాయణ, మెడిసేటి కోసం సిబ్బంది గాలించారు. మంగళవారం మధ్యాహ్ననికి వారి ఇద్దరి మృతదేహాలను కూడా వెలికితీశారు. అయితే.. మంచు తుఫాన్ కారణంగా అమెరికన్లు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ మంచు తుఫాను ప్రారంభమైన దగ్గర నుంచి శీతల గాలుల వల్ల, అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 50 మంది మరణించారు.

