
వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్‌లో ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు టీ20 క్రికెట్ అంటే ఈ విండీస్ ఆల్ రౌండర్ చెలరేగిపోతాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచంలో ఎక్కడ టీ20 లీగ్ జరిగినా సూపర్ ఫామ్ తో దూసుకెళ్తాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ కు వీడ్కోలు పలికినా ప్రపంచ టీ20 లీగ్ ల్లో తన హవా కొనసాగిస్తున్నాడు. తన టీ20 కెరీర్ లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న పొలార్డ్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో జట్టుకు టైటిల్ అందించి కొన్ని అసాధారణ రికార్డ్స్ ను నెలకొల్పాడు.
ఒక్కడే 18 టీ20 టైటిల్స్:
ఏ ఆటగాడికైనా తమ జట్టు ఛాంపియన్ గా నిలవడం ఒక కల. అయితే పొలార్డ్ జట్టులో ఉంటే మాత్రం టైటిల్ గెలవడం చాలా ఈజీ. 38 ఏళ్ల ఈ అనుభవజ్ఞుడు జట్టు మరో టైటిల్ గెలుచుకుంది. కరీబియర్ ప్రీమియర్ లీగ్ లో పొలార్డ్ ఆడుతున్న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు సీపీఎల్ 2025 ఫైనల్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. దీంతో పొలార్డ్ టీ20 టైటిల్స్ సంఖ్య 18కి చేరింది. ఫైనల్స్ కు ముందు అత్యధికంగా 17 టైటిల్స్ తో డ్వేన్ బ్రావోతో సమంగా ఉన్న పొలార్డ్ కరీబియన్ ప్రీమియర్ టైటిల్ గెలుచుకొని అత్యధిక టీ20 టోర్నమెంట్ ఫైనల్స్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.
400 క్యాచ్ లు:
అసాధారణ ఫీల్డింగ్ చేస్తాడనే పేరు తెచ్చుకున్న పొలార్డ్ టీ20 చరిత్రలో 400 క్యాచ్‌ల మైలురాయిని సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఆదివారం (సెప్టెంబర్22) అమెజాన్ వారియర్స్‌తో జరిగిన కరీబియన్ లీగ్ ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున నాలుగు క్యాచ్‌లు పట్టడంతో అతని క్యాచ్ ల సంఖ్య 401కి చేరింది. 2006 నుంచి 2025 మధ్య 720 టీ20ల్లో పొలార్డ్ 401 క్యాచ్‌లను అందుకున్నాడు. 321 క్యాచ్ లతో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్.. పొలార్డ్ కంటే చాలా దూరంలో ఉన్నాడు. ఇప్పటికే 720 టీ20 మ్యాచ్ ల్లో టాప్ లో ఉన్న ఈ విండీస్ ఆల్ రౌండర్.. 950 పైగా సిక్సర్లతో.. 13 వేలకు పైగా పరుగులతో గేల్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.