CPL 2025: 8 బంతుల్లోనే 7 సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్.. గేల్ రెండు ఆల్‌టైం రికార్డ్స్‌కు చేరువలో పొలార్డ్

CPL 2025: 8 బంతుల్లోనే 7 సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్.. గేల్ రెండు ఆల్‌టైం రికార్డ్స్‌కు చేరువలో పొలార్డ్

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్‌లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. పొట్టి ఫార్మాట్ లో తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. కెరీర్ ప్రారంభం నుంచి పొట్టి ఫార్మాట్ లో అదరగొడుతున్న ఈ విండీస్ వీరుడు 38 ఏళ్ళ వయసులోనూ సిక్సర్లతో సునామీ సృష్టిస్తున్నాడు. టీ20 కెరీర్ లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న పొలార్డ్.. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో 8 బంతుల్లోనే 7 సిక్సర్లు బాది గేల్ రికార్డ్స్ కు చేరువగా వచ్చాడు. ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 1) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై పొలార్డ్ దుమ్ములేపాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) తరపున ఆడుతున్న ఈ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగి  29 బంతుల్లో 65 పరుగులు చేశాడు. వీటిలో 8 సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. హైలెట్ ఏంటంటే ఈ మ్యాచ్ లో పొలార్డ్ 8 బంతుల్లోనే 7 సిక్సర్లు కొట్టాడా. నవియన్ బిడైసీ వేసిన 15 ఓవర్లో చివరి నాలుగు బంతుల్లో 3 సిక్సర్లు కొట్టిన పొలార్డ్.. 16 ఓవర్లో వకార్ సలాంఖీల్‌ వేసిన చివరి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. 

ఈ క్రమంలో 21 బంతుల్లోనే పొలార్డ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్ లో పొలార్డ్ సిక్సర్ల సంఖ్య 950 కి చేరింది. గేల్ (1056) తర్వాత టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా పొలార్డ్ నిలిచాడు. మరో ఏడాదిపాటు టీ20 క్రికెట్ లో కొనసాగినా.. గేల్ సిక్సర్ల రికార్డును పొలార్డ్ బద్దలు కొట్టొచ్చు. ఈ లీగ్ లో 14 వేల పరుగులను పూర్తి చేసుకున్న ఈ విండీస్ ఆల్ రౌండర్  టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన గేల్ (14562) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భవిష్యత్ లో ఈ రికార్డ్ పొలార్డ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 12 పరుగుల తేడాతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పొలార్డ్ 29 బంతుల్లోనే 8 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. పూరన్ హాఫ్ సెంచరీ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులకు పరిమితమైంది. ఆండ్రీ ఫ్లెచర్ 54 బంతుల్లో 67 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.