రెచ్చగొడితే అణు బాంబులేసేస్త!

రెచ్చగొడితే అణు బాంబులేసేస్త!

సియోల్: తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటామని ఉత్తర కొరియా ప్రెసిడెంట్​ కిమ్ జోంగ్ ఉన్ తేల్చిచెప్పారు. తమను రెచ్చగొడితే వాటిని ఉపయోగిస్తామని స్పష్టంచేశారు. తాము అణ్వాయుధ పరీక్షలు కొనసాగిస్తామని పరోక్షంగా అమెరికా, దాని మిత్రపక్షాలను హెచ్చ రించారు. ఉత్తరకొరియా ఆర్మీ 90వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ప్యోంగ్యాంగ్ ప్లాజాలో మిలటరీ పరేడ్ నిర్వహించారు. శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థలతో నిర్వహించిన ఈ పరేడ్‌‌‌‌లో దళాలను ఉద్దేశించి కిమ్ మాట్లాడారు. ‘‘మన దేశ అణుశక్తిని వీలైనంత వేగంగా అభివృద్ధి చేసేందుకు, బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యల అమలును కొనసాగిస్తాం. యుద్ధాన్ని నివారించడమే మన అణ్వాయుధ దళాల ప్రాథమిక మిషన్. కానీ మన దేశ భూభాగంలో అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే..  రెండో మిషన్‌‌‌‌ను నిర్వహించడం తప్ప వేరే మార్గమేదీ మన అణు దళాలకు ఉండదు” అని కిమ్ చెప్పినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌‌‌‌ఏ) వెల్లడించింది. ‘‘ఈ పరేడ్‌‌‌‌లో పాల్గొన్న ప్రేక్షకులు.. ఇంటర్‌‌‌‌‌‌‌‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ‘హ్వాసాంగ్-17’ను చూసినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఇది ‘జుచే’ (స్వయం సమృద్ధి), కొరియా సంపూర్ణ శక్తిని, ప్రపంచానికి మన రిపబ్లిక్ వ్యూహాత్మక స్థితిని చూపించింది’’ అని కేసీఎన్‌‌‌‌ఏ తెలిపింది.