కిమ్ బిడ్డ ఫొటోలు మళ్లీ రిలీజ్

కిమ్ బిడ్డ ఫొటోలు మళ్లీ రిలీజ్

సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పదేండ్ల బిడ్డ కిమ్ జూ ఆయ్ ఫొటోలు మళ్లీ రిలీజ్ అయ్యాయి. వారం కిందట హసంగ్​ –17 మిసైల్ లాంచింగ్ సందర్భంగా తండ్రితో కలిసి నడిచిన కిమ్ జూ ఫొటోలను నార్త్ కొరియా అధికారిక వార్తా సంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ)’ బయటపెట్టగా.. ఆదివారం మళ్లీ కొన్ని ఫొటోలను పబ్లిష్ చేసింది. కిమ్ జోంగ్ ఉన్ తన బిడ్డతో కలిసి మిసైల్ సైంటిస్టులు, సోల్జర్లతో దిగిన ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఇంతకుముందు కిమ్ ప్రియమైన బిడ్డ అంటూ టైటిల్ పెట్టిన కేసీఎన్ఏ.. ఈసారి కిమ్ కు ‘అత్యంత ప్రియమైన బిడ్డ’ అంటూ టైటిల్ పెట్టి.. మరింత గౌరవాన్ని చాటుకుంది. దీంతో కిమ్ జోంగ్ తన బిడ్డ కిమ్ జూ ఆయ్ నే తన వారసురాలిగా ట్రెయిన్ చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

వారసురాలిగా ప్రొజెక్ట్ చేసేందుకేనా? 

కిమ్ జోంగ్ కు కిమ్ జూ ఆయ్ తో పాటు 12 ఏండ్ల కొడుకు, మరో 5 ఏండ్ల బిడ్డ ఉన్నట్లు చెప్తుంటారు. ఉత్తర కొరియాను 7 దశాబ్దాలుగా పాలిస్తున్న కిమ్ ఫ్యామిలీలో కిమ్ జోంగ్ ఉన్ మూడో తరం నేత. ఇప్పుడు నాలుగో తరం దేశాధినేతగా తన గారాలపట్టి అయిన కిమ్ జూను ప్రొజెక్ట్ చేసేందుకే ఇలా ఆమెను బయటకు తీసుకొస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొడుకు కొంచెం పెద్దవాడైనా అతనికి నాయకత్వ లక్షణాలు లేవని కిమ్ నమ్మడం.. లేదా బిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టం కావడం ఇందుకు కారణమై ఉండొచ్చని పేర్కొంటున్నారు.

అయితే, గతంలో కిమ్ గానీ, అతని తండ్రి గానీ పెద్ద వాళ్లు అయ్యాకనే ప్రపంచం ముందుకు వచ్చారు. కానీ తన బిడ్డను ఇప్పటి నుంచే భావి దేశాధినేతగా ప్రజల మనసుల్లో ముద్ర వేసేందుకే కిమ్ ఇలా ఆమెను బయటకు తీసుకొస్తున్నారని అంటున్నారు. పోయినసారి కంటే ఈసారి కిమ్ జూ ఆయ్ లో కొంచెం పరిణతి కూడా వచ్చిందని పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడే ఆమెను వారసురాలిని చేస్తారని ఒక నిర్ణయానికి రావడం కూడా కరెక్ట్ కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.