Sekhar Kammula: నాగార్జునకు రీ-ఎంట్రీ ఇచ్చింది 'శివ'నే: 4K డాల్బీ అట్మాస్ వెర్షన్‌పై శేఖర్ కమ్ముల ఆనందం.

Sekhar Kammula: నాగార్జునకు రీ-ఎంట్రీ ఇచ్చింది 'శివ'నే: 4K డాల్బీ అట్మాస్ వెర్షన్‌పై శేఖర్ కమ్ముల ఆనందం.

టాలీవుడ్ కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సృష్టించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ'  ఇది ఈ ఇద్దరి కెరీర్‌లో మైలురాయిగా నిలిచి చరిత్ర సృష్టించింది.  ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో 34 ఏళ్ల తర్వాత రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సారి  మోనో మిక్సింగ్‌ నుంచి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌కి మార్చేసి 4K వెర్షన్‌లో విడుదల చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నేపపత్యంలో  పలువురు సినీ ప్రముఖులు ఆనాటి ‘శివ’ రోజుల జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.

"శివకు ముందు, శివకు తర్వాతే తెలుగు సినిమా!
 
లేటెస్ట్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనాటి ‘శివ’ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘శివ’ చిత్రానికి తనతో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా, సినిమా షూటింగ్ తమ ఇంటి దగ్గరలోనే జరగడంతో, నాగార్జున షూటింగ్‌కు వస్తే తామంతా చూడటానికి వెళ్లేవాళ్లమని చెప్పారు. అయితే, ఆ సమయంలో సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాత్రం ఎవరికీ తెలియదని కమ్ముల అన్నారు. ‘శివ’ సినిమా చూసిన అనుభవాన్ని వివరిస్తూ, ఆయన ఆ చిత్రాన్ని క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో చూశానని, సినిమా చూసిన తర్వాత అందరిలాగే తాను కూడా షాక్ అయ్యానని పేర్కొన్నారు. నిజానికి, ఆ సమయంలో నాగార్జున కెరీర్‌కు మళ్లీ ఒక రీ-ఎంట్రీ ఇచ్చింది ‘శివ’ అనే చెప్పవచ్చని శేఖర్ కమ్ముల అభిప్రాయపడ్డారు. 

 

ఒక క్లాసిక్ మాస్టర్‌పీస్ పుట్టుక

శివ సినిమా తెలుగు సినిమా పోకడనే పూర్తిగా మార్చేసింది. అంతకుముందు కమర్షియల్ ఫార్ములాతో సాగిన చిత్రాలకు భిన్నంగా, ట్రూ క్లాసిక్ మాస్టర్‌పీస్‌గా నిలిచింది. ఈ సినిమాలో RGV ఉపయోగించిన వినూత్నమైన యాక్షన్ టెక్నిక్స్, ముఖ్యంగా సైకిల్ చైన్ వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. కీరవాణి అద్భుతమైన సంగీతం, అమల హీరోయిన్ గా నటించి యువతను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం RGV, నాగార్జున కెరీర్‌లకు మాత్రమే కాక, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక న్యూ వేవ్ ను ప్రారంభించింది.

‘శివ’ సినిమాకు ముందు, తర్వాతే తెలుగు సినిమా చరిత్రను విభజించవచ్చని (Before Shiva After Shiva) శేఖర్ కమ్ముల గట్టిగా నొక్కి చెప్పారు. అలాంటి అపురూపమైన చిత్రం మళ్లీ నవంబర్ 14న రీ-రిలీజ్ అవుతుండటం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్లాసిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మళ్లీ థియేటర్‌లో చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.