తిరుపతి: దేశవ్యాప్తం ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో భక్తులు సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఆయన కార్యాలయంలో సోమవారం (డిసెంబర్ 15) ఉదయం సీనియర్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించదలచిన ఐదువేల ఆలయాలకు గాను అవసరమైన రెండు, మూడు డిజైన్లు సిద్ధం చేయాలని సీఈని ఆదేశించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.
తిరుపతిలోని వినాయక నగర్ దగ్గర ఉన్న టీటీడీ స్టాఫ్ క్వార్టర్స్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. అప్పలాయగుంట ఆలయం దగ్గర భక్తులకు సమాచారం తెలిసేలా సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
శ్రీవారి ఆలయంలో ఉన్న కదిలే వంతెన మరమ్మతు పనులను వైకుంఠ ఏకాదశిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముంబైలోని బాంద్రా ఆలయంలో జేఈవో, చీఫ్ ఇంజనీర్,సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థానికాలయాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ఆయా ఆలయాల అభివృద్ధికి సంబంధిత అధికారుల తో సమన్వయం చేసుకుని సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కూడా టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పారు. కర్ణాటకలోని బెలగావిలో ఆలయం నిర్మాణం, బీహార్ లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఆయా అధికారులతో సంప్రదించి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ధార్మిక ప్రచురణలకు సంబంధించి ఇదివరకే ముద్రించిన పుస్తకాల పంపిణీ విషయంలో తగు సూచనలు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా టీటీడీ ప్రచురణల్లో బాగా డిమాండ్ ఉన్న పుస్తకాలను పాఠకుల అభిరుచి మేరకు పునర్ ముద్రణకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన జేఈవోకు సూచించారు.
