హుస్నాబాద్, వెలుగు : ‘బీజేపీ లీడర్లు మేము అర్బన్ హీరోలం అని చెప్పుకోవడం హాస్యాస్పదం, 2020తో పోలిస్తే వాళ్ల ఓట్లు, సీట్లు గాలిలో కలిసిపోయాయి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు మరోసారి కాంగ్రెస్ పాలనపై నమ్మకం చాటారని, సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్ వరకు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారన్నారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో 293 వార్డులు గెలిచిన బీజేపీ,ఈ సారి కేవలం 249కే పరిమితమైందన్నారు. కార్పొరేషన్లు మినహా ఒక్క మున్సిపాలిటీలో కూడా ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 80 నుంచి 90 శాతం చైర్మన్, మేయర్ స్థానాలను కైవసం చేసుకుందని చెప్పారు. బీఆర్‌ఎస్ గతంలో పోలీసులను అడ్డంపెట్టుకొని గెలిస్తే.. తాము మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మనసు గెలుచుకున్నామని చెప్పారు.
పైసలు పంచుతూ దొరికిన బీఆర్‌ఎస్ లీడర్లను పోలీసులు తీసుకెళ్తుంటే.. గంగుల కమలాకర్ వంటి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారని మండిపడ్డారు. హుస్నాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా డ్రైనేజీ, రోడ్లు, ఇతర వసతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు లింగమూర్తి, శివయ్య, మంజులరెడ్డి, రవీందర్, వెంకటరమణ పాల్గొన్నారు.
