- పంట మార్పిడిపై అవగాహన కల్పించండి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే మా ప్రభుత్వ ప్రయార్టీ
- సిద్దిపేటకు యంగ్ ఇండియా స్కూల్ కేటాయిస్తామని వెల్లడి
- జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు
సిద్దిపేట/ములుగు, వెలుగు: పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వానకాలం సీజన్‌లో జిల్లాలో యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. యాసంగి సీజన్‌లో అదనంగా 36 శాతం వడ్లు కొనుగోలు చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.
జిల్లాలో ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులకు అవగాహన కల్పించి నాణ్యమైన మొక్కలు పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెంకుటిళ్లు కాకుండా అన్ని పక్కా ఇళ్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, జిల్లాలో పెంకుటిళ్లను గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం అత్యధిక ప్రయార్టీ ఇస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలులో సిద్దిపేట జిల్లా అధికారులు బాగా పని చేస్తున్నారని అభినందించారు.
వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, ఉత్తీర్ణత శాతం పెరిగేలా చూడాలన్నారు. సిద్దిపేటలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, బస్తీ దవాఖానాల్లో డాక్టర్ల నియామించాలని సూచించారు. టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు యువతకు విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నట్టు మంత్రి వివేక్ చెప్పారు. సిద్దిపేట, దుబ్బాకల్లో విదేశీ భాషల శిక్షణకు ప్రత్యేకంగా ట్రైనర్లను నియమిస్తామని, స్థానిక ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపాలన్నారు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలన్ని అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, వంటేరు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు. దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి 27 శాఖల పురోగతిని సమీక్షించారు. వ్యవసాయ, హౌసింగ్, ఆర్ అండ్ బీ, మైన్స్ శాఖల అధికారుల నివేదికలు తప్పుల తడకగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి పేదవాడికి సొంత ఇల్లే కాంగ్రెస్ లక్ష్యం..
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌లో నిర్వహించిన నాభిశిల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ నాయకులు పేద ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి ప్రాజెక్టులపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ బ్యారేజీని కట్టారని, కానీ దాంట్లో 10 టీఎంసీల నీళ్లు కూడా స్టోర్ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
రూ.9 వేల కోట్లతో మల్లన్న సాగర్ బ్యారేజీ కడితే, గత ఐదేండ్లలో రూ.4 వేల కోట్లు కేవలం మిత్తి కట్టినట్టు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్తగా ఈ నెల నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కడపల నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్, మర్కుక్ మండల అధ్యక్షుడు నర్సింలు, గ్రామ సర్పంచ్ బుల్లె రాణి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాబు, జైపాల్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
