స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో   తెలంగాణ నంబర్ వన్: మంత్రి వివేక్ వెంకటస్వామి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో   తెలంగాణ నంబర్ వన్: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట: -మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం 23 వేల కోట్ల రుణాలు అందించింది
  •     మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని వెల్లడి
  •     మెదక్ కలెక్టరేట్ లో స్మార్ట్ రేషన్​ కార్డుల పంపిణీ

మెదక్/మనోహరాబాద్, వెలుగు: దేశంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్​లో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తమ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోందన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్​ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం రూ.23 వేల కోట్ల రుణాలు అందించిందని చెప్పారు. అలాగే, ఫ్రీ బస్​ జర్నీతో మహిళా సంఘాలకు బస్సులు కేటాయించామని తెలిపారు. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. స్కూళ్లలో స్టూడెంట్లకు సన్న బియ్యంతో మంచి భోజనం పెడుతున్నామని, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. గత ఏడాది ఒక్కో సెగ్మెంట్​కు 3వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఈ ఏడాది మరో 2,500 ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు.

రూ.200 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా స్థాపిస్తున్నామని చెప్పారు. గనుల శాఖ ద్వారా రూ. వెయ్యి కోట్ల ఆదాయం తెచ్చామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, మెదక్, రామయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల చైర్ పర్సన్లు పాల్గొన్నారు.

టూరిజం సర్క్యూట్‌గా మెదక్ 

మెదక్ ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్ ఖిల్లా ఫొటో, చరిత్రతో పోస్టల్ డిపార్ట్​మెంట్ రూపొందించిన స్పెషల్ పోస్టల్ కవర్ ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి మంత్రి సోమవారం మెదక్​ఖిల్లా మీద రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టల్​ డిపార్ట్​మెంట్​ ప్రత్యేక పోస్టల్​ కవర్​ తీసుకురావడం గొప్ప విషయమన్నారు. మెదక్​ఖిల్లా అభివృద్ధికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు అవసరమని.. ఎంపీ రఘునందన్​రావు చొరవ తీసుకుని కేంద్రం నుంచి నిధులు తేవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేలా తాను కృషి చేస్తానని చెప్పారు. ఎక్స్​పర్ట్​ల అభిప్రాయాలు తీసుకుని ఖిల్లా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్​కు సూచించారు. మెదక్ జిల్లా చారిత్రక ప్రాశస్త్యాన్ని గుర్తించి పోస్టల్​ డిపార్ట్​మెంట్​ స్పెషల్​ పోస్టల్​ కవర్ తీసుకురావడ సంతోషకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు​అన్నారు.  మెదక్​ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ రాధిక, వైస్​ చైర్మన్ నరేశ్​ గౌడ్​, ఏఎస్​పీ విక్రాంత్​ కుమార్​ సింగ్, పోస్టల్​ సూపరింటెండెంట్​ విజయ్​ పాల్గొన్నారు. 

నిరుద్యోగ యువతకు భరోసాగా మేసిక్​ పోర్టల్​

నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కలెక్టర్ ప్రతిమ సింగ్ చొరవతో రూపొందించిన మెదక్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, స్కిల్స్ అండ్​ ఇండస్ట్రీ కనెక్ట్ (మేసిక్) పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటెక్స్ లో మంత్రి సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, నైపుణ్య సంస్థలు, స్థానిక పరిశ్రమలను ఒకే డిజిటల్ వేదికపైకి తెచ్చేందుకు ఐటీసీ లిమిటెడ్ సహకారంతో ఈ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించారని, విద్యార్థుల నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు జిల్లాలోని పరిశ్రమల్లో పొందేందుకు ఈ పోర్టల్​ వేదికగా ఉంటుందన్నారు. తెలంగాణలో సమీకృత ఉపాధి, -నైపుణ్య వేదికను ప్రారంభించిన మొదటి జిల్లాగా మెదక్ నిలుస్తుందని, జిల్లాలోని ఐటీఐలు, పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు మేసిక్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నిరుద్యోగులు తమ అర్హతలకు తగిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, ఐలా చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ సుబ్బారావు, ఐటీసీ ప్రతినిధులు ఆనంద్, సందీప్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్​ పర్సన్​ కీర్తన, కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా  విద్యాలయ భవనానికి శంకుస్థాపన

మండలంలోని కూచారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి మంత్రి వివేక్​ శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో చన్నీటితో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని, కొత్త భవనంలో గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, పాఠశాలలో ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం సౌకర్యం కల్పించాలని విద్యార్థులు మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.