రామరాజ్య పునాది..!

రామరాజ్య పునాది..!

భారత జాతి ఐదు శతాబ్దాలుగా.. ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శుభఘడియ వచ్చేసింది. జనవరి 22న వేదపండితుల సమక్షంలో,  సాధువులు, సంతుల మార్గదర్శనంలో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు కలిసి అయోధ్య మందిరంలో బాలరాముడి (రామ్‌‌‌‌లల్లా) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మహత్తర కార్యక్రమం హిందువులకు, సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరికీ ఉద్వేగంతో కూడిన గర్వకారణమైన సందర్భం. 

ఆదర్శమూర్తి, మర్యాద పురుషోత్తముడైన రాముడికి ప్రజాస్వామికంగా 500 ఏళ్ల తర్వాత. ఓ మందిరాన్ని నిర్మించుకునే హక్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికి లభించిన సువర్ణావకాశం.  రామమందిరం కోసం కోట్లాది మంది ప్రజలు ఎన్నోత్యాగాలను, ఇంకెన్నో బలిదానాలను, మరెన్నో కష్టాలను దాటుకుని ముందడుగు వేయాల్సి వచ్చింది. 

తరతరాలుగా హిందూ సమాజం.. ధర్మానికి ప్రతిరూపమైన రాముడికి గుడి కట్టేందుకు సంయుక్తంగా పోరాడాల్సి వచ్చింది. నాడు రామమందిర రక్షణ కోసం శ్రీరాముడి వంశజులైన సూర్యవంశ క్షత్రియులు రాజా గజరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ నేతృత్వంలో.. బాబర్‌‌‌‌  సైన్యాధ్యక్షుడైన మీర్‌‌‌‌ బాకీ నేతృత్వంలోని క్రూరులైన సైన్యంతో తీవ్రంగా పోరాడారు. అయోధ్య రామమందిరాన్ని కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డి వారు ప్రాణత్యాగం చేశారు. విదేశీ పాలకులైన మొగలులు అయోధ్యను హస్తగతం చేసుకుని మందిరాన్ని ధ్వంసం చేసి అదేస్థానంలో మసీదు నిర్మించారు. ఈ దుర్మార్గం తమ కళ్లముందే జరగడాన్ని నాడే సామాన్య ప్రజలు ముఖ్యంగా హిందువులు జీర్ణించుకోలేకపోయారు. 

రామమందిరాన్ని సందర్శించిన గురునానక్

రామమందిరాన్ని కాపాడలేకపోయామన్న బాధతో.. మళ్లీ మందిరాన్ని అక్కడ నిర్మించే వరకు.. సంప్రదాయంగా ధరించే తలపాగాను ధరించబోమని సూర్యవంశ క్షత్రియులు శపథం చేశారు. ఇంకొందరైతే.. రామమందిర నిర్మాణం పూర్తయ్యేంతవరకు చెప్పులు వేసుకోబోమని దీక్ష తీసుకున్నారు. అనేకమంది ఇలాంటి కఠినమైన ప్రతినబూని 8 తరాలు గడిచింది. వేలాదిమంది తమ ప్రతిన నెరవేరక ముందే స్వర్గస్తులయ్యారు. ఇలా దేశవ్యాప్తంగా చాలా మంది రామమందిర నిర్మాణానికి సంబంధించి ఎన్నో కలలు కన్నారు.

 అలాంటి వారందరి కల నేడు సాకారం కాబోతోంది. మరో కీలకమైన విషయం.. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ఇతర విశ్వాసాల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు వారందరూ అంబరాన్నంటుతున్న సంబరాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. ఉదాహరణకు.. సిక్కుమత స్థాపకుడైన శ్రీ గురునానక్‌‌‌‌ దేవ్‌‌‌‌.. రామమందిరాన్ని 1510లో సందర్శించారు. 2019లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సందర్భంలోనూ... గురునానక్‌‌‌‌ దేవ్‌‌‌‌ సందర్శనను కీలకమైన సాక్ష్యంగా పరిగణించింది. 

ఇయ్యాల మందిర నిర్మాణం పూర్తిచేసుకుని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో సిక్కు మతస్థులందరూ.. దేశంలోని వివిధ పాంతాల్లో 48 గంటలపాటు గురుగ్రంథ సాహిబ్‌‌‌‌ (సిక్కుల పవిత్ర గ్రంథం)ను ‘అఖండ పఠనం'తో ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. 

దేశమంతా ఉద్వేగం

తూర్పున ఉన్న కోహిమా నుంచి.. పశ్చిమాన ఉన్న కచ్‌‌‌‌ వరకు, ఉత్తరాన ఉన్న కశ్మీర్‌‌‌‌ నుంచి.. దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు దేశమంతా.. ఒకే నినాదం, ఒకే ఉద్వేగం.. “సియావర్‌‌‌‌ రామచంద్రకీ జై.  ఊరూ వాడా ఏకమై.. సకల జనులు కలిసి 500 ఏండ్ల నిరీక్షణను.. తమదైన పద్ధతిలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అటు వివిధ దేశాల్లోనూ భారతీయులు పెద్దఎత్తున తమ స్థాయిలలో అత్యంత వైభవంగా రామమందిర ప్రాణప్రతిష్ఠ  సందర్భంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. 

 భారతీయత ప్రభావం ఉన్నటువంటి దేశాల్లో.. కొరియా నుంచి కంబోడియా వరకు..అంటిగ్వా, బార్బుడా వంటి చిన్న చిన్న ద్వీపదేశాల్లోనూ రామమందిర నిర్మాణ సందర్భాన్ని ఓ మహోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా.. ఈ వేడుకలన్నీ మన సాంస్కృతిక వారసత్వ పునరుజ్జీవనం నేపథ్యంలోనే జరుగుతున్నాయి.  మళ్లీ సనాతనానికి సర్వామోదాన్ని కట్టబెట్టే దిశగా జరుగుతున్నాయి. కానీ, కొందరు అయోధ్య ఆహ్వానాలు వచ్చినప్పటికీ... దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ.. పరమ పవిత్రమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించడం దురదృష్టకరం. 

దేశమంతా ఉత్సాహంగా ఈ ఉత్సవంలో భాగస్వామ్యం అయితే.. వారు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం.. వారి మైనారిటీల సంతుష్టీకరణ ఆలోచనను మరోసారి బహిరంగ పరుస్తోంది. కొన్ని మైనారిటీ వర్గాలను పోలరైజ్‌‌‌‌ చేయడం, వారిని ఓటు బ్యాంకుగా మలచుకోవడం.. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లాలన్న ఆలోచనే.. వారిని పవిత్రమైన, చరిత్రాత్మక ఘట్టమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండేలా చేసింది.

రాజకీయ లబ్ధికోసం బుజ్జగింపులు

1951 మే నెలలో, భారతదేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్‌‌‌‌ బాబూ రాజేంద్రప్రసాద్‌‌‌‌కి పలు లేఖలు రాసి నెహ్రూ.. సోమనాథ్‌‌‌‌ ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావొద్దని సూచించారు. ఈ కార్యక్రమం కోసం.. ప్రపంచదేశాల్లోని వివిధ  నదుల నుంచి నీటిని తీసుకొచ్చి విగ్రహాన్ని అభిషేకించాలని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌‌‌‌ భావించారు. కానీ, నాటి ప్రధాని నెహ్రూ స్వయంగా విదేశాంగ శాఖ కార్యదర్శికి, విదేశాల్లోని భారత అంబాసిడర్లకు లేఖలు రాసి, రాష్ట్రపతికి ఈ విషయంలో సహకరించొద్దని ఆదేశించడం.. నెహ్రూ కుటుంబానికి ఉన్న ఆలోచనకు అద్దం పడుతుంది. 

 అదే విధంగా, సేతు సముద్రం షిప్పింగ్‌‌‌‌ కెనాల్‌‌‌‌ ప్రాజెక్టు కోసం.. హిందువుల అస్తిత్వాన్ని ప్రతిబింబించే ‘రామసేతు’ను ధ్వంసం చేయాలని 2007లో సుప్రీంకోర్టుకు అఫిడవి ట్‌‌‌‌ సమర్పించింది నాటి కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం. భారతీయ ప్రాచీన సాహిత్యంలో, పురాణ, ఇతిహాసాల్లో పేర్కొన్న అంశాలను చారిత్రక రికార్డులుగా పరిగణించలేమని.. వీటి ఆధారంగా..ఇతిహాసాల్లో పేర్కొన్న పాత్రల అస్తిత్వాన్ని పరిగణించలేమని ఆ అఫిడవిట్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి ప్రాణప్రతిష్ఠకు సిద్ధమైన సందర్భంలోనూ కాంగ్రెస్​ పార్టీది అదే ధోరణి. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ మన నాగరికత వారసత్వానికి కనీస గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నది. 

దేశ చరిత్రను మలుపు తిప్పే ఘట్టం

నిజానికి కాంగ్రెస్‌‌‌‌ పార్టీ చేస్తున్న ఈ కుట్రకోణం..మైనారిటీలను అవమానించడమే. 1980వ దశకంలో..షాబానో కేసులో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ వ్యవహరించిన తీరు దేశప్రజలకు తెలుసు. విడాకులు పొందిన ఒక ముస్లిం మహిళకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఆమె భర్తనుంచి భరణం అందాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో సదరు ముస్లిం మహిళకు న్యాయం జరగాల్సి ఉన్నప్పటికీ... రాజీవ్‌‌‌‌ గాంధీ నేతృత్వంలోని నాటి కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అడ్డుకుంది. సుప్రీంకోర్టు తీర్పును తక్కువచేసి చూపించేలా.. పార్లమెంటులో వెంటనే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది.

 కాంగ్రెస్‌‌‌‌ పార్టీ చేసిన ఆ ఒక్క నిర్ణయమే.. ముస్లిం మహిళలకు శాపంగా మారింది.ప్రస్తుత సందర్భంలోకి వస్తే... రామమందిర నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.. భారతదేశ చరిత్రను, దేశ ప్రయాణాన్ని మరో మేలిమలుపునకు తీసుకెళ్లే చారిత్రక ఘట్టమిది. ఇది మన దేశ నాగరికత చైతన్యాన్ని ప్రతిబింబించే అద్భుత కార్యక్రమంగా మన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతుంది. 

దేశానికి అయోధ్య ఒక ఆధ్యాత్మిక కీర్తి పతాక

మర్యాద పురుషోత్తముడు.. సకలగుణాభిరాముడు, ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వస్తున్న ఈ సందర్భం.. మరింత బలమైన, ఆత్మవిశ్వాసం  కలిగిన భారతదేశాన్ని నిర్మాణం చేసుకుని.. ప్రజలందరి సాధికారతతోపాటుగా, ప్రపంచవ్యాప్తంగా మనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని శాశ్వతంగా నిలుపుకునేందుకు అవసరమైన శక్తిని, అవసరమైన ప్రేరణను కలిగించనుంది. అదే అసలైన రామరాజ్య నిర్మాణానికి పునాది.  2047లో వందేళ్ల భారత స్వాతంత్ర్యోత్సవాల నాటికి మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచి... ప్రపంచానికి విశ్వగురు స్థానంలో ఉండాలని, దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పోయి.. మౌలిక వసతులను  పెంచుకుని విద్య, వైద్యరంగాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని, ఐకమత్యంతో కలిసి ముందుకెళ్లేవిధంగా మరోసారి పునరంకితం కావాలి.

దేశానికి అస్తిత్వం హిందూయిజం

సనాతన ధర్మానికి చెందిన ప్రతి అంశాన్నీ సంకుచిత,  వక్రీకరించిన రాజకీయ దృక్కోణంలో  చూడటం.. మన నాగరికత పట్ల ఉండాల్సిన కనీస గౌరవం వారికి లేదన్న విషయాన్ని బహిరంగపరుస్తోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠను  వ్యతిరేకిస్తున్నవారు, ఈ మహత్కార్యాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నవారు. అసలు ఈ దేశానికి అస్తిత్వమే హిందూయిజం, హిందూ జీవన విధానమే భారతీయ జీవన విధానమని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని మరిచిపోయారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెడుతున్నది. 

హిందూత్వమే అన్న  విషయాన్ని అంగీకరించాలని అనుకోవడం లేదు. వాస్తవం వారికి జీర్ణం కావడం లేదు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ తరచుగా ఇలాంటి చారిత్రక తప్పిదాలతో తన పరువు తానే తీసుకుంటోంది. గతంలోనూ హిందూత్వాన్ని తుడిచిపెట్టేందుకు, మన నాగరిక విలువలను తుంగలో తొక్కేందుకు ఆ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఉదాహరణకు, విదేశీ దురాక్రమణదారుల దాడుల్లో దెబ్బతిన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సౌరాష్ట్ర సోమనాథుడి విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించేందుకు.. నవంబర్‌‌‌‌ 1947లో సర్దార్‌‌‌‌ వల్లభాయ్‌‌‌‌ పటేల్‌‌‌‌ సంకల్పించారు. దీనికి మహాత్మాగాంధీ కూడా సంపూర్ణంగా మద్దతుగా నిలిచారు. కానీ, ఈ పవిత్ర కార్యాన్ని, మన ధర్మాన్ని పునర్నిర్మించుకునే సందర్భాన్ని నాటి ప్రధాని జవహార్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. 

- జి.కిషన్‌‌‌‌ రెడ్డి, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు