పోలింగ్ ముగిసేదాకా .. అలర్ట్​గా ఉండండి

పోలింగ్ ముగిసేదాకా .. అలర్ట్​గా ఉండండి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో గురువారం పోలింగ్ సందర్భంగా బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ సూచించారు. బుధవారం వారిద్దరూ బూత్ అధ్యక్షులు, మండల, జిల్లా బీజేపీ అధ్యక్షులు, పార్టీ అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా ఎలా వ్యవహరించాలనే దానిపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటరును కలిసి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరాలని సూచించారు. 

న్యూట్రల్ ఓటర్లను బీజేపీకి ఓటు వేసేలా  ప్రయత్నించాలన్నారు. పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా దగ్గర్లోని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. అనంతరం రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకురావాలని వెల్లడించారు. బీజేపీ సానుభూతి పరుల ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసుకునే బాధ్యత బూత్ అధ్యక్షులదేనని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసి, ఈవీఎంలకు సీల్ వేసే వరకు పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లు అక్కడే ఉండాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.