- ప్రధానితో మీటింగ్ విషయాలు బయటకు చెప్తరా?: కిషన్‌రెడ్డి
- అక్కడ జరిగింది ఒకటైతే.. మీడియాకు వేరే చెప్పారు
- వాళ్లెవరో చెబితే చర్యలు తీస్కుంటామని వార్నింగ్
న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశానికి సంబంధించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మీటింగ్‌లో చర్చించిన విషయాలు బయటకు చెప్పవద్దని మోదీ స్వయంగా ఆదేశించారని తెలిపారు. ‘‘అయినా.. ఎవరో ‘మెంటలోళ్లు’ అక్కడ జరిగింది ఒకటైతే.. మీడియాకు వేరుగా చెప్పారు” అని పేర్కొన్నారు. వాళ్లెవరో చెబితే చర్యలు తీస్కుంటాం అని హెచ్చరించారు. మంగళవారం ఢిలీల్లోని తన అధికారిక నివాసంలో క్రీడలకు సంబంధించిన అంశాలపై కిషన్‌రెడ్డి ప్రెస్ మీట్
నిర్వహించారు. అనంతరం ఆయన చిట్ చాట్ చేశారు.
‘‘ఇటీవల పార్లమెంట్‌లో తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. అక్కడ జరిగింది వేరు మీడియాలో వచ్చింది వేరు. మీటింగ్ జరిగింది వాస్తవమే. పార్టీ, సోషల్ మీడియాను మరింత బోపేతం చేయడం, తదితర అంశాలపై ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. కానీ.. ఆ మీటింగ్‌లో లేని విషయాలను ఎవరో మెంటలోళ్లు బయటకు చెప్పారు’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎంఎంటీఎస్ రెండో దశపై చర్చించా...
తెలంగాణలో కొనసాగుతున్న పలు రైల్వే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం సమీక్ష సమావేశం జరిపినట్టు చెప్పారు. రూ. 400 కోట్లతో హైదరాబాద్–యాదగిరిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశపై చర్చించినట్టు తెలిపారు. కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కేంద్ర మంత్రిని కోరానని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో మొత్తం 42 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్‌చోర్–గద్దీ చోడ్’ మహాధర్నాలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రధాని మోదీ స్థాయిని తగ్గించేలా అనైతికంగా మాట్లాడారన్నారు.
