బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి
  • ఎన్నికల మేనేజ్​మెంట్ కమిటీ చైర్మన్​గా ఈటల 
  • ఎలక్షన్​ టైమ్ ​దగ్గర పడడంతో పార్టీ హైకమాండ్​ కీలక నిర్ణయం
  • తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల అధ్యక్షుల మార్పు

ముచ్చటగా మూడోసారి..

ముచ్చటగా మూడోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న టైంలో తొలిసారి కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రాని(ఏపీ)కి బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు. 2010 నుంచి 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాష్ట్రంలో, ఢిల్లీలో కొట్లాడారు. ఉద్యమంలో భాగంగా ఢిల్లీ ఏపీ భవన్ లో నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తొలి అధ్యక్షుడిగా పని చేశారు. 2014 నుంచి 2016 వరకు దాదాపు రెండేండ్లు అధ్యక్ష హోదాలో పార్టీని నడిపించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రానికి చివరి, తెలంగాణ రాష్ట్రానికి తొలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిలిచారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు టైమ్​ దగ్గర పడుతుండటంతో కిషన్​రెడ్డికే మరోసారి పార్టీ హైకమాండ్​ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. 

న్యూఢిల్లీ, వెలుగు : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. రాష్ట్రానికి కొత్తగా ఎన్నికల మేనేజ్​మెంట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా ఏర్పాటు చేసింది. ఈ పదవీ బాధ్యతలను ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అప్పగించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతకుమార్​తో కలిసి బండి సంజయ్ ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసుకు వచ్చారు. పార్టీ ఆఫీసులో జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ను కలిశారు. 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి 

దాదాపు రెండు గంటలకు పైగా నేతలతో సంజయ్ సమావేశం జరిగింది. పార్టీ తీసుకున్న అధ్యక్ష మార్పు అవసరాన్ని నేతలు వివరించారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్​ రాజీనామా సమర్పించారు. అనంతరం కొద్దిసేపటికే బీజేపీ హైకమాండ్​ అధ్యక్ష మార్పులు చేస్తూ మీడియాకు ఉత్తర్వులు విడుదల చేసింది. త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో పార్టీలో కీలక మార్పులు చేసింది.  తెలంగాణతోపాటు మరో మూడు రాష్ట్రాలకు కూడా అధ్యక్షులను మార్చింది. 

ఆ మూడు రాష్ట్రాల్లోను..

    తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల అధ్యక్షులను కూడా జేపీ నడ్డా మార్చారు. ఇందులో బీజేపీ ఏపీ చీఫ్​గా దగ్గుబాటి పురందేశ్వరీ, పంజాబ్ చీఫ్​గా సునీల్ జాఖడ్, జార్ఖండ్ చీఫ్​గా బాబులాల్ మరాండీని నియమించారు. కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్​ కుమార్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పార్టీ నియమించింది. 

  • ఏపీలో సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరీకి అవకాశం కల్పించింది. ఉమ్మడి, రాష్ట్ర విభజన తర్వాత పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా పురందేశ్వరీ నిలిచారు. ఆమె ప్రస్తుతం చత్తీస్ గఢ్​ బీజేపీ ఇన్​చార్జ్​గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
  • బీజేపీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సునీల్ జాఖడ్ 2022లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన పంజాబ్​లోని గుర్దాస్పుర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్​గా కూడా సేవలందించారు. 
  • బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బాబులాల్ మరాండీ.. బీజేపీ నుంచి జార్ఖండ్ సీఎంగా పని చేశారు. అనంతరం జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీని స్థాపించారు. దాదాపు 14 ఏండ్లు ఆ పార్టీని నడిపి 2020లో తిరిగి బీజేపీ గూటికి చేరారు. 

ఢిల్లీకి వెళ్లిన కిషన్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైనట్లు ప్రకటన వెలువడ్డ సమయంలో హైదరాబాద్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోగ్రామ్​లో ఉన్న కిషన్ రెడ్డి.. సాయంత్రం ఆ ప్రోగ్రామ్ ముగించుకొని నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన అక్కడి నుంచి హంపీ వెళ్లాల్సి ఉంది. బుధవారం అక్కడ జరుగనున్న జీ 20 సదస్సులో పాల్గొనాల్సి ఉండే. అయితే ఆ టూర్​ను రద్దు చేసుకొని నేరుగా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఆయన పార్టీ అగ్ర నేతలను కలువనున్నట్లు సమాచారం.