- గత ప్రభుత్వం కార్మికుల కష్టార్జితాన్ని సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్ కు ఖర్చుపెట్టింది: కిషన్ రెడ్డి
- రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలే రూ.47 వేల కోట్లున్నయ్
- నైనీ బ్లాక్‌లో వాటాల కోసమే సైట్ విజిట్ కొర్రీలు
- మీరు నిర్వహించకుంటే చెప్పండి.. కేంద్రమే వేలం వేస్తది
- రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో తెచ్చిన బీఆర్ఎస్వాళ్లే.. సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ అడగడం విడ్డూరంగా ఉందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోటీపడి మరీ నాశనం చేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉండాల్సిన సంస్థను అప్పుల కుప్పగా మార్చారని, కార్మికుల రక్తం, చెమటతో వచ్చిన లాభాలను.. గత ప్రభుత్వం లో సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్‌కు ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి విధ్వంసానికి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని స్పష్టం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్రానిది, 49 శాతం కేంద్రానిది వాటా ఉన్నా.. పెత్తనమంతా రాష్ట్రానిదేనని చెప్పారు.
బోర్డులో 10 మంది డైరెక్టర్లు ఉంటే ఏడుగురు రాష్ట్రం వాళ్లే. మేం ఏం చెప్పినా వినరు. పైగా నష్టాలొస్తే కేంద్రం మీద నెట్టేస్తున్నరు’’ అని ఫైర్అయ్యారు.. రాష్ట్రంలోని జెన్‌కో సహా ఇతర సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలే రూ. 47 వేల కోట్ల వరకు ఉన్నాయని వివరించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు బకాయిలు చెల్లించకుండా సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయన్నారు. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ‘‘కార్మికుల సంక్షేమం కోసం, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం వాడాల్సిన సీఎస్ఆర్ నిధులను.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆఫీసుల్లో సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్ కట్టుకునేందుకు మళ్లించారు. ఇది కార్మికుల పొట్టకొట్టడం కాదా?’’ అని ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద రావాల్సిన రూ.1500 కోట్లు కూడా జిల్లాలకు ఇవ్వలేదని ఆరోపించారు.
సీబీఐని రావొద్దన్నది మీరేగదా?
సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలని కొందరు అడుగుతున్నారని, అసలు రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకూడదని జీవో తెచ్చింది బీఆర్ఎస్ సర్కారు కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సీబీఐని అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు సీబీఐ కావాలంటే సీఎం రేవంత్ రెడ్డినే అడగాలని, అంతేగానీ కేంద్రాన్ని కాదన్నారు. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో టన్ను బొగ్గు తీయడానికి రూ.1,736 ఖర్చయితే, సింగరేణిలో మాత్రం రూ.2,878 ఖర్చవుతోందని కిషన్ రెడ్డి చెప్పారు.సింగరేణిలో నిర్వహణ లోపం, అవినీతి వల్లే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, ఈ భారం అంతా అంతిమంగా ప్రజల మీదే పడుతోందన్నారు. నూతన టెక్నాలజీని వాడకుండా పాత పద్ధతుల్లోనే బొగ్గు తీస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నైనీ కోల్ బ్లాక్ వేలానికి సిద్ధం
నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శించారు. టెండర్లలో ఎక్కడా లేని విధంగా ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధన పెట్టి, తమకు కావాల్సినోళ్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందన్నా వినకుండా.. కావాలనే కొర్రీలు పెట్టి 17 కంపెనీలను పక్కనపెట్టారని వివరించారు. తాడిచెర్ల బ్లాక్‌ను బీఆర్ఎస్ ప్రైవేటుకు అప్పగించినట్టే, నైని బ్లాక్‌ను కూడా అమ్మేసే ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోతే ఆ బ్లాక్‌ను కేంద్రానికి అప్పగిస్తే.. పారదర్శకంగా వేలం వేసి సింగరేణికి కేటాయిస్తామని స్పష్టం చేశారు.
