గ్యాస్ ధర తగ్గిస్తే విమర్శలా? రాష్ట్రంలో పెట్రోల్​పై ట్యాక్స్ ఎందుకు తగ్గించలే?: కిషన్ రెడ్డి

గ్యాస్ ధర తగ్గిస్తే విమర్శలా? రాష్ట్రంలో పెట్రోల్​పై ట్యాక్స్ ఎందుకు తగ్గించలే?: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : వంట గ్యాస్ సిలిండర్‌‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించడాన్ని కూడా కల్వకుంట్ల కుటుంబసభ్యులు ఎగతాళి చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పెట్రో ఉత్పత్తులపై మన రాష్ట్రంలోనే అత్యధికంగా ట్యాక్స్ లు వేస్తున్న విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరలున్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని ఓ సారి గుర్తు చేసుకోవాలని ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

గతంలో అన్ని రాష్ట్రాలు తమ ప్రజల కోసం పెట్రో ఉత్పత్తులపై పన్నులను కొంతమేర తగ్గించుకున్నాయని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదన్నారు. బస్సు చార్జీలను, కరెంటు చార్జీలను పెంచడమే తప్ప తగ్గించడం గుర్తుండని సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లు గురివింద రీతిలో వ్యవహరిస్తున్నారని.. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైందని, అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.