ఎందులో కడుగుతరు .. బీఆర్ఎస్ నేతల కామెంట్లపై కిషన్ రెడ్డి 

ఎందులో కడుగుతరు .. బీఆర్ఎస్ నేతల కామెంట్లపై కిషన్ రెడ్డి 
  • కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారన్న 
  • ఇది అక్రమ కేసు అంటున్న కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్
  • బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్ చేశారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్​కేసులోఅరెస్టయిన కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఆమె ఏ రకంగా కడిగిన ముత్యంలా తిరిగివస్తారో చెప్పాలి. ఎందులో కడుగుతారో చెప్పాలి. అది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు” అని అన్నారు.

మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కవితను అక్రమ కేసులతో అరెస్టు చేశారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘‘ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా? లేదా? కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి, అందులో తన బినామీ మనుషులను పెట్టారా? లేదా? తన కనుసైగల్లో వ్యాపార సంస్థను నడిపిస్తూ, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంతో మంతనాలు జరిపారా? లేదా? కోట్లాది రూపాయలు చేతులు మారాయా? లేదా?” అని ప్రశ్నించారు.

వీటన్నింటిపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్​లో కవిత జోక్యం లేనట్లయితే, ఇది అక్రమ కేసు అయితే, రాజకీయపరమైన కక్షసాధింపు అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తన హయాంలో నిజాంను పొగుడుతూ, నిజాం పోకడతోనే పాలన చేశారని.. ఏనాడూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో పని చేయలేదని విమర్శించారు. 

ఫోన్ ట్యాపింగ్​పైన్యాయ విచారణ చేయాలె.. 

ఇంకా అధికారంలో ఉన్నట్లే కేసీఆర్ కుటుంబసభ్యులు భావిస్తున్నారని.. అబద్ధాలు, ఆరోపణలు చేయడం మానలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే మాటలతోనే పదేండ్ల పాటు పాలన చేశారని విమర్శించారు. బీజేపీని విమర్శిస్తే ఊరుకునేది లేదని, కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల ముందుంచుతామని హెచ్చరించారు. ‘‘రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ​ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. పోలీస్ ఆఫీసర్లు మాఫియాగా ఏర్పడి రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు.

బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆధారాలు బయటపడుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. దీనికి బాధ్యత వహించాల్సింది అప్పటి సీఎం కేసీఆరే. దీనికి బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలి” అని కిషన్​ రెడ్డి డిమాండ్  చేశారు.  అలాగే, హోలీ రోజు చంగిచర్లలో గిరిజన మహిళలపై దాడి చేసినోళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.