ప్రజల హక్కులను..కాలరాస్తున్న కేసీఆర్ : కిషన్​రెడ్డి

ప్రజల హక్కులను..కాలరాస్తున్న కేసీఆర్ : కిషన్​రెడ్డి

తెలంగాణ ప్రజల హక్కులు కాలరాస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ ​అయ్యారు. ‘‘నిరసన తెలిపే హక్కు దేశంలో అందరికి ఉంది. కానీ తెలంగాణలో మాత్రం లేదు. ఏ సంఘాలు పోరాటం చేస్తే రాష్ట్రం వచ్చిందో.. ఆ సంఘాలన్ని కనబడకుండా చేసిండు. బయట ఉద్యమాలు చేయొద్దు.. నాలుగు రోజులే నడిచే అసెంబ్లీలో.. ప్రజల సమస్యలు లెవనెత్తితే మైక్ కట్.. ఇదేమైనా నిజాం రాజ్యమా..’’ అని విమర్శించారు. నిరుద్యోగ సమస్యలపై 24 గంటల నిరాహార దీక్షను కిషన్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద బుధవారం చేపట్టగా.. అదే రోజు రాత్రి పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బీజేపీ స్టేట్ ఆఫీసులో వదిలిపెట్టారు. ఆయన అక్కడే తన దీక్షను కొనసాగించారు.

 గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్.. కిషన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కేసీఆర్ అబ్బ సొత్తు కాదని, ఆయన కుటుంబం సొత్తు అసలే కాదని, ఇది నాలుగు కోట్ల మంది ప్రజలదని హెచ్చరించారు. ఆయన లాంటి అవినీతిపరులను, నియంతృత్వ శక్తులను సమాజం చాలా మందినే చూసిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందు వారంతా కనుమరుగైపోయారని.. రానున్న రోజుల్లో కేసీఆర్ పరిస్థితి కూడా అంతే అన్నారు.

కార్యకర్తల తెగువ గొప్పది: ప్రకాశ్ జవదేకర్

కిషన్ రెడ్డిది సాహసోపేతమైన నిర్ణయమని, దీక్ష సందర్భంగా బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువ గొప్పదని ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించారు. ఇప్పటికే బీజేపీ సత్తాను కేసీఆర్ కు చూపించామని. కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. దీక్షకు యువత మద్దతు చూసి కేసీఆర్ భయపడ్డాడని.. అందుకే  పోలీసులను పంపి భగ్నం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. యువత కేసీఆర్ ను గద్దె దింపి.. తెలంగాణను బతికించుకోవాలని కోరారు.

సికింద్రాబాద్ నుంచి పరకాలకు కిషన్​రెడ్డి బైక్ ర్యాలీ

తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడంలో భాగంగా ఈ నెల 15న శుక్రవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాలలోని అమరధామం వరకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ బైక్​ ర్యాలీ నిర్వహించనుంది. ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి నివాళి అర్పిస్తారు. తర్వాత బైక్ ర్యాలీని ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి ప్రారంభిస్తారు. పరకాలలోని అమరధామం చేరుకొని అమరులకు నివాళి అర్పించిన తర్వాత బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతారు.