నిరాధార ఆరోపణలు చేయడం రాహుల్‌‌కు అలవాటే  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నిరాధార ఆరోపణలు చేయడం రాహుల్‌‌కు అలవాటే  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • ఈసీఐపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌‌రెడ్డి విమర్శించారు. ఫామ్‌‌–6 విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈసీ ఇచ్చిన వివరణతో ఆయన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయాయని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుబట్టడం, కాంగ్రెస్ గెలిచినప్పుడు మౌనంగా ఉండటం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాల్లో భాగమేనని దుయ్యబట్టారు. గతంలో ‘చౌకీదార్ చోర్ హై’ నినాద వ్యవహారంలో సుప్రీంకోర్టుకు రాహుల్ బేషరతు క్షమాపణ పత్రం సమర్పించారని, ప్రధాని మోదీ ఇంటిపేరు కేసులోనూ న్యాయస్థానం ఆయనకు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు.

ముందుగా అబద్ధాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం, తీరా కోర్టులకు వెళ్లాక క్షమాపణలు చెప్పడం ఆయన రాజకీయ వైఖరికి అద్దం పడుతోందని తెలిపారు. తన రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేయడం రాహుల్ గాంధీ మానుకోవాలని హితవుపలికారు.