ఈటలను జైలుకు పంపే కుట్ర 

ఈటలను జైలుకు పంపే కుట్ర 

అయినా హుజూరాబాద్​లో గెలిపించుకుంటం: కిషన్​రెడ్డి
రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పులపాలు జేసిండు
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన నడుస్తోంది
నియంతృత్వాన్ని ఎదిరించినందుకు ఈటల కుటుంబాన్ని వేధిస్తున్నరు
కాంగ్రెస్​కు ఓటేసినా అది టీఆర్​ఎస్​కు వేసినట్లేనని విమర్శ

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను జైలుకు పంపించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈటలను  జైలుకు పంపినా తాము ఆయనను హుజూరాబాద్ నుంచి గెలిపించుకుంటామని చెప్పారు. ‘‘కేసీఆర్ నియంతృత్వ పోకడలను ఎదిరించినందుకు ఈటల కుటుంబాన్ని కేసీఆర్ వేధిస్తున్నారు. ఈటలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఆయన ఇప్పుడు బీజేపీ కుటుంబ సభ్యుడు” అని అన్నారు. ఏడేండ్లలో తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఆయన తీరుతో విసుగెత్తిపోయిన జనం ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపు చూస్తున్నారని కిషన్​రెడ్డి చెప్పారు. కాంగ్రెస్​కు ఓటు వేసినా అది టీఆర్ఎస్​కు వేసినట్లేనన్నారు. 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అవినీతి, అహంకార టీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించే వరకు ఏ ఒక్క బీజేపీ కార్యకర్త నిద్రపోవొద్దని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్​ చుగ్  పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ  ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్  లంకను తగులబెట్టాలన్నారు. ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. టీఆర్​ఎస్​ అబద్ధపు మాటలకు మోసపోయి ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకువస్తే ప్రజలను కుక్కలతో పోల్చిన ఘనత కేసీఆర్ దేనని మండిపడ్డారు.  నిరుద్యోగభృతి ఏమైందని, దళితులకు మూడెకరాలు ఎటు పోయిందని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఎక్కడి వరకు వచ్చాయని కేసీఆర్‌ను నిలదీశారు. 
అందుకే ఆ రోజు నుంచి..
తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చని నేతకు తగిన బుద్ధి చెప్పేందుకే ఆగస్టు 9న బీజేపీ రాష్ట్ర శాఖ పాదయాత్ర చేపడుతోందని, ఆ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉందని చుగ్​ అన్నారు. గతంలో దేశం నుంచి బ్రిటిష్​ వాళ్లను వెళ్లగొట్టేందుకు ఆగస్టు 9న పెద్ద ఉద్యమం ప్రారంభమైందని, ఇప్పుడు తెలంగాణ తానీషా కేసీఆర్ నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు అదే రోజున  పాదయాత్రను చేపడుతున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పాదయాత్ర రూపంలో మొదటి అడుగు బీజేపీ వేయబోతున్నదని తెలిపారు. తెలంగాణలోని ప్రతి పల్లెకు వెళ్లే పాదయాత్రలను కూడా చేపడుతామని  చుగ్  చెప్పారు. ‘‘టీకాలు మోడీ ఇస్తున్నారు. నిధులూ మోడీ ఇస్తున్నారు.. అయినా తెలంగాణలో టీకాలను ప్రజలందరికీ ఇప్పించడంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయింది” అని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీని నడిపేది ప్రజలేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ  వారం కిందటి  వరకు టీఆర్ఎస్  చేతిలో ఉండేదని, ఇప్పుడది టీడీపీ చేతిలోకి వెళ్లిందని చుగ్​ విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో ‘సేవా హీ సంఘటన్’ కార్యక్రమం పేరుతో బీజేపీ కార్యకర్తలు కరోనా బాధితులకు సేవలు అందించారని, దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నా తమ క్యాడర్ కరోనా నియంత్రణలో అలుపెరగకుండా పని చేసిందన్నారు. 
యూనిటీగా పనిచేయాలి
యూనిటీగా పనిచేసి ఈటల రాజేందర్ ను గెలిపించాలని హుజూరాబాద్​ ఇన్​చార్జులకు, నేతలకు బీజేపీ స్టేట్​ ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముందు హుజూర్ బాద్  ఇన్​చార్జులు, ఈటల రాజేందర్ తో ఆయన సమావేశమయ్యారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో పార్టీ అనుచరించాల్సిన వ్యూహం, ప్రచారం వంటి అంశాలపై చర్చించారు. ఇన్​చార్జులకు, నేతలకు తరుణ్ చుగ్  దిశా నిర్దేశం చేశారు. ఈటల రాజేందర్​పై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన  అన్నారు. మీటింగ్  అనంతరం ఈటల రాజేందర్​ మీడియాతో మాట్లాడారు. 
కేసీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మరు: ఈటల
కేసీఆర్, టీఆర్‌ఎస్  ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో ఎగిరేది బీజేపీ జెండానే అని ఈటల రాజేందర్​ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం లేవనెత్తుతున్నారని తెలిపారు. కేసీఆర్ చెప్పే అబద్ధాలు నమ్మడానికి ప్రజలు  సిద్ధంగా లేరని ఈటల అన్నారు. హుజూరాబాద్ ఎన్నికను కేసీఆర్  లైఫ్ అండ్ డెత్ గా భావిస్తున్నారని,  అందుకే వందల కోట్లు పెడుతున్నారన్నారు.