అక్టోబర్ 6న తెలంగాణకు నడ్డా.. 10న అమిత్​షా రాక

 అక్టోబర్ 6న తెలంగాణకు నడ్డా..  10న అమిత్​షా రాక
  • నవంబర్​ మొదటివారంలోపు 30 భారీ సభలు
  • 5, 6 తేదీల్లో హైదరాబాద్​లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు
  • ఈ నెల రెండోవారంలో అభ్యర్థుల ఫస్ట్​ లిస్ట్​
  • కిషన్​రెడ్డి వెల్లడి.. ఢిల్లీలో అమిత్​ షాతో భేటీ
  • రాష్ట్రంలోని పరిస్థితులు, నేతల పర్యటనలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: రానున్న పది రోజుల్లో తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పర్యటిస్తారని పార్టీ స్టేట్​ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని చెప్పారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో కిషన్​రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అద్దగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు..  ప్రధాని మోదీ, నడ్డా, అమిత్​ షా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల తెలంగాణ టూర్లపై చర్చించారు. 

త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, క్షేత్ర స్థాయిలో ప్రచారంపై డిస్కస్​ చేశారు.  అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ రెండో వారంలో పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. త్వరలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై, అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు. నవంబర్ మొదటి వారంలోపు రాష్ట్రంలో దాదాపు 30 భారీ సభలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.  

5,6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు

అక్టోబర్ 5, 6 తేదీల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగుతాయని కిషన్​రెడ్డి ప్రకటించారు. తొలి రోజు సమావేశంలో సునీల్ బన్సల్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్​చార్జులు, రాష్ట్ర పదాధికారుల భేటీ ఉంటుందన్నారు. 6వ తేదీన నడ్డా అధ్యక్షతన సమావేశం ఉంటుందని వివరించారు. ఇందులో అన్ని అసెంబ్లీ స్థానాల కన్వీనర్లు, ఇన్​చార్జులు సహా దాదాపు 800 మంది పాల్గొంటారని వెల్లడించారు.  తెలంగాణ పర్యటనకు మరోసారి ప్రధాని మోదీ వస్తున్నారని, మంగళవారం నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారని కిషన్​రెడ్డి తెలిపారు.