రైతులకు మేలుచేసే చట్టాలను దుర్మార్గంగా అడ్డుకుంటున్నారు

రైతులకు మేలుచేసే చట్టాలను దుర్మార్గంగా అడ్డుకుంటున్నారు
  • ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
  • రైతుల అభివృద్ధి కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు
  • ఎంఎస్పీ కొనసాగుతుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ‘‘దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. మంచి చట్టాలు చేస్తున్నారు. అయినా ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ స్వార్థం కోసం దుర్మార్గంగా వీటిని అడ్డుకుంటున్నాయి’’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల అభివృద్ధి కోసం కొత్త వ్యవసాయ చట్టం తీసుకువస్తే.. స్వాగతించాల్సిన ప్రతిపక్షాలు రైతులను మోసం, అన్యాయం చేసే చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ‘‘కొత్త చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎంఎస్పీని రద్దు చేస్తారని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇతర ప్రతిపక్షాలకు చెబుతున్నా.. ఎట్టి పరిస్థితుల్లో ఎంఎస్పీని రద్దు చేయబోం’’ అని స్పష్టం చేశారు. గతంలో కంటే ఎక్కువ కాటన్ కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లో కొత్త వ్యవసాయ చట్టంపై రైతు సంఘాల ప్రతినిధులు, అగ్రికల్చర్ ఎక్స్​పర్టులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై కిషన్ రెడ్డి మాట్లాడారు.

రైతులకు మేలు చేసే చట్టం

కొత్త అగ్రి చట్టం.. రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. ‘‘గతంలో విత్తనాలను రైతులే తయారు చేసుకునేవారు. ఇప్పుడు విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్ని కార్పొరేటు మయం అయిపోయాయి. కొత్త చట్టంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టినట్లే. ఎరువులను ఇతర దేశాల నుంచి తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతులకు ఎక్కడ కొరత ఏర్పడకుండా యూరియా అందించాం” అని వివరించారు. రైతుల అభివృద్ధి కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాన్ని చేర్చారని, ఇప్పుడు తాము అమలు చేస్తే అదే పార్టీ వ్యతిరేకిస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఎస్పీ కోసం రూ.62,800 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు చేశామన్నారు. ఈ కొత్త చట్టంతో రైతులు ఎక్కడైనా తనకు నచ్చిన వ్యక్తికి, నచ్చిన ధరకు అమ్ముకోవచ్చన్నారు. పత్తి, ధాన్యం, గోధుమలు చివరి గింజ వరకు కేంద్రమే కొనుగోలు చేస్తుందన్నారు.

కొత్త చట్టాలతో లాభాలే: జయ ప్రకాష్ నారాయణ

దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి శాపం కారణం కాదని, ఇది ముమ్మాటికీ పాలకుల పాపమేనని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. కొత్త చట్టాలు మరీ అద్భుతమేమీ కాదని, అయితే ఇప్పటి పరిస్థితులకు అవసరమన్నారు. కొత్త చట్టాలు వల్ల లాభాలే ఉన్నాయ ని, రాజకీయ పార్టీలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతులకు లాభం కలగాలంటే కొత్త చట్టాలు అమలు కావాలన్నారు. వీటితో రైతులకు స్వేచ్చ ఉంటుందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డితో పాటు రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ ఎక్స్​పర్టులు పాల్గొన్నారు

ప్రచార రథం ప్రారంభం

సికింద్రాబాద్, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికతో పాటు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రచార రథాన్ని కిషన్​రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం హైదరాబాద్ సీతాఫల్​మండిలో జరిగిన బీజేపీ కోర్​కమిటీ సమావేశానికి హాజరైన ఆయన.. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు హర్షకిరణ్, హరి, సారంగపాణి, రాజు పాల్గొన్నారు.

వారి మాటలు నమ్మొద్దు: లక్ష్మణ్

రైతులకు మేలు జరిగేలా రైతు సంఘాలు, అగ్రి ఎక్స్ పర్టులు చూడాలని, కొత్త వ్యవసాయ చట్టంపై అవగాహన కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు. అగ్రి చట్టాలపై తప్పుడు ప్రచారం చేసే వారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. అగ్రికల్చర్ ఎక్స్ పర్టులు సిఫార్సు చేసినవి మాత్రమే కొత్త చట్టంలో పెట్టారని చెప్పారు. రైతులకు న్యాయం జరగాలంటే దళారీ వ్యవస్థ పోవాలని, కొత్త చట్టంతోనే ఇది సాధ్యమని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు. కొత్త చట్టంతో యువత మరింతగా వ్యవసాయ రంగంలోకి వస్తారన్నారు.