శత్రువులకే పరాభవం.. భారత్కు విజయమే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

శత్రువులకే పరాభవం.. భారత్కు విజయమే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షం:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     బీజేపీ స్టేట్ ఆఫీసులో ఉగాది వేడుకలు

హైదరాబాద్, వెలుగు: శ్రీపరాభవ నామ సంవత్సరం మన దేశానికి విజయాలను చేకూరుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పరాభవం మనకు కాదని,  దేశాన్ని అస్థిరపరిచే శత్రువులకు, దేశద్రోహులకు మాత్రమే అది వర్తిస్తుందన్నారు. భారతదేశం పవిత్రమైన పుణ్యభూమి అని, ఈ కొత్త ఏడాదిలో దేశానికి మంచి భవిష్యత్తు ఉండబోతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో గురువారం ఉగాది వేడుకలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా సిద్ధాంతి కాకునూరి సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రస్తుతమున్న  ఎనిమిది సంఖ్య రెట్టింపు కాబోతున్నదని  ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యను ఉద్దేశించి అన్నారు. ఈ ఏడాది నవ నాయకులలో మంత్రిపదవి కుజుడికి దక్కడం వల్ల దేశ రక్షణ శాఖ అత్యంత పటిష్టంగా ఉండబోతోందని చెప్పారు. 

ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, కుజుడి ప్రభావంతో మన సరిహద్దుల్లోకి శత్రువులు రాకుండా అడ్డుకోగలమన్నారు. దేశంలో కొత్త విద్యా విధానం ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పారు. ప్రపంచ దేశాలు యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నా, ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారత్  అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కోగలరని భరోసా ఇచ్చారు. పండితుల లెక్కల ప్రకారం ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో కష్టసుఖాలు సహజమని, ఉగాది పచ్చడిలోని షడ్రుచులు దానికి ప్రతీకలని అన్నారు. వాటిని ధైర్యంగా, ఐక్యతతో ఎదుర్కోవడమే ఈ పండుగ ఇచ్చే గొప్ప సందేశమని ఆయన వివరించారు.

ఏఐపై పట్టు సాధించాలి: రాంచందర్ రావు

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని బీజేపీ స్టేట్​చీఫ్​రాంచందర్ రావు పిలుపునిచ్చారు. టెక్నాలజీలో ప్రపంచం వేగంగా ముందుకు సాగుతోందని, ముఖ్యంగా ఏఐపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో జీ20 దేశాల్లో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగినా, మోదీ దౌత్య నీతితో  భారత్‌‌‌‌లో ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పారు. 

దేశంలో గ్యాస్ కొరత లేదన్నారు. ఇప్పటికే 92,700 మెట్రిక్  టన్నుల ఎల్‌‌‌‌పీజీతో భారీ నౌకలు భారత్‌‌‌‌కు చేరుకున్నాయని గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితుల కోసం 5.33 మిలియన్ మెట్రిక్  టన్నుల ముడిచమురును వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచామని, ఇంధన సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు.