- ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను మూసీలో కలిపారా? లేదా గాంధీ భవన్‌లో పాతరేశారా?
- సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికొదిలేశారా? అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేదా గాంధీ భవన్‌లో పాతరేశారా? అని అడిగారు. ఈ మేరకు ఆదివారం సోనియాగాంధీకి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్ పుస్తకాన్ని ఢిల్లీకి వచ్చి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మీకు అందజేశారు. రెండేండ్ల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం దూరదృష్టిని మీరు అభినందించారు. ఆ విజన్ డాక్యుమెంట్‌కు తగ్గట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కానీ, గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడ వేదికగా ‘అభయహస్తం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను మీరే ఆవిష్కరించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలుఅమలు చేస్తామని స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటుతున్నది. మరి.. మీరు, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఆవిష్కరించిన మేనిఫెస్టో అమలు గురించి ఏనాడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? మీరు స్వయంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై మిమ్మల్ని కలిసినప్పుడైనా రేవంత్‌రెడ్డిని అడిగారా? రెండేండ్ల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డిని మీరు అభినందించారంటే.. తెలంగాణలో ఆరు గ్యారంటీలుఅమలు చేశారా? లేదా? అనేది మీకు తెలిసినట్టు లేదు. కనీసం.. తెలుసుకునే ప్రయత్నం మీరు చేసినట్టు లేదు.
హామీలు గాలికొదిలేసి, ప్రజలను వంచిస్తూ విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకుని మీకు మీరే ఒకరినొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టి, మళ్లీ ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త హామీలు ఇస్తున్నారు. ఇకనైనా.. కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
లేదంటే మీరు ప్రయోగించిన అభయ హస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై మిమ్మల్ని అధికారానికి దూరం చేయకుండా మానదు! ప్రధానంగా.. గ్యారెంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలి. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
