స్వామి గౌడ్‌ను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టిన కిషన్ రెడ్డి

స్వామి గౌడ్‌ను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టిన కిషన్ రెడ్డి
  • జూమ్ యాప్ ద్వారా సంతాప సభ
  • ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీజేపీ పెద్దలు

హైదరాబాద్, వెలుగు: పదవులతో సంబంధం లేకుండా నిరంతరం పార్టీ కోసం శ్రమించిన గొప్ప నాయకుడు స్వామి గౌడ్ అని ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బీజేపీ పెద్దలు. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్, ఎల్బీ నగర్ కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు స్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సంతాప సభను బుధవారం జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ  రాంచందర్ రావు, పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్​, ఇంద్ర సేనా రెడ్డి, మంత్రి శ్రీనివాస్, పేరాల శేఖర్ రావు, ఆచారి, ప్రకాష్ రెడ్డి, ఎస్ కుమార్, మల్లారెడ్డి, శ్రీవర్థన్ రెడ్డి తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  ఢిల్లీ నుంచే మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వామి గౌడ్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టారు. తన ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన స్వామి గౌడ్ మరణం వ్యక్తిగతంగానూ తనకు తీరని లోటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారని పలు కార్యక్రమాల్లో ఇద్దరు కలిపి పనిచేశామని గుర్తు చేసుకున్నారు.  దాదాపు నాలుగు దశాబ్దాలుగా సంఘ్, ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలో స్వామి గౌడ్ చురుగ్గా పాల్గొన్నారని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తంటూ ఆయన సేవలను బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు.