24 గంటల దీక్షను విరమించిన కిషన్ రెడ్డి

24 గంటల దీక్షను విరమించిన కిషన్ రెడ్డి

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. 24 గంటల నిరసన దీక్షను చేపట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీక్షను విరమించారు. కేంద్రమంత్రి  ప్రకాశ్ జవదేకర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.  

ఈ సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..  కిషన్ రెడ్డి  సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నాని తెలిపారు. శాంతియుతంగా కిషన్ రెడ్డిధర్నా చేస్తే.. కేసీఆర్ సర్కార్ కు ప్రాబ్లం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ భయపడ్డాడు కాబట్టే పోలీసులను పంపించి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసేలా ఉద్యమాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. 

Also Read : TSRTC విలీనం బిల్లుకు గ‌వ‌ర్నర్ ఆమోదం

ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్ కు చూపించామన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు.  

ఏం జరిగిందంటే..

నిన్న (సెప్టెంబర్ 13) హైదరాబాద్ ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్ష చేశారు. బీజేపీ 24 గంటల ఉపవాస దీక్షకు పోలీసులు సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. అయితే గురువారం సాయంత్రం 6 అయ్యాక దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు కిషన్ రెడ్డిని కోరారు. కానీ కిషన్ రెడ్డి సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం వరకు  దీక్ష చేస్తామనడంతో పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. 

దీంతో  కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులకు, కిషన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బీజేపీ కార్యకర్తలను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.