మేం అధికారంలోకి రాగానే..ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు : కిషన్​రెడ్డి

మేం అధికారంలోకి రాగానే..ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు : కిషన్​రెడ్డి
  • ట్రైబల్ వర్సిటీకి సమ్మక్క, సారక్క పేరు పెట్టడం గర్వకారణం : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి
  • గిరిజన ఆడబిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపీ చిత్తశుద్ధికి నిదర్శనం 
  • రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం వెనక ప్రధాని పాత్ర గొప్పది

ములుగు, తాడ్వాయి, వెలుగు : బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు10 శాతం రిజర్వేషన్​ అమలు చేస్తామని, సమ్మక్క, సారక్క సాక్షిగా తాను ఈ విషయాన్ని ప్రకటిస్తున్నట్టు  కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ 9 ఏండ్ల పాలనలో 10 శాతం రిజర్వేషన్ ​అమలుకు నోచుకోలేదని విమర్శించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను మంత్రి దర్శించుకున్నారు. సమ్మక్క, సారక్కలకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పసుపు, కుంకుమ, చీరెసారె, బంగారం(బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

ములుగు దగ్గర యూనివర్సిటీ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ములుగులో ఏర్పాటు చేస్తున్న జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం రూ.900 కోట్లు మంజూరు చేసిందని, ఈ వర్సిటీకి సమ్మక్క, సారక్క పేరు పెట్టడం గర్వకారణమని, అందుకు ఇక్కడి ప్రజల తరఫున మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ములుగు ప్రాంతాన్ని కోట్ల వ్యయంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజం హబ్​గా మారుస్తున్నామన్నారు.

మేడారం, లక్నవరం, తాడ్వాయి, దామెరవాయి, మల్లూరు, బొగత జలపాతాలను కలుపుతూ ట్రైబల్​సర్క్యూట్ పేరుతో డెవలప్​చేశామన్నారు. భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను అత్యంత వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. 

ప్రధాని కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు

ములుగు జిల్లాలోని రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం వెనుక ప్రధాని మోదీ కృషి ఉందని కిషన్​రెడ్డి తెలిపారు. ఆదివాసులను ఏకం చేసిన అల్లూరి సీతారామరాజు125 వ జయంతి ఉత్సవాలను భీమవరంలో ప్రధాని   ప్రారంభించడం, హైదరాబాద్ లో ముగింపు వేడుకలకు  రాష్ట్రపతి హాజరుకావడం గిరిజనుల పట్ల కేంద్రానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనమన్నారు.

హైదరాబాద్​లో రాంజీ గోండు పేర ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో 17 ఏకలవ్య స్కూళ్లను నెలకొల్పామన్నారు. కిషన్​రెడ్డి టూర్ సందర్భంగా మేడారంలో బీజేపీ నేత అజ్మీర కృష్ణవేణి నాయక్​సొమ్మసిల్లి పడిపోగా కార్యకర్తలు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్​రావు,   ఎమ్మెల్యే ఈటల తదితరులు ఉన్నారు. 

హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం మేడారం వెళ్లిన కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ నేతల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల, జాతీయ నేతల టూర్లు రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే ప్లాన్, ఎలక్షన్ లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే విషయాలపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలు పిలిచినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, బీఆర్ఎస్ జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భిక్షపతి ముదిరాజ్ తదితరులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వీరి చేరికల ప్రోగ్రామ్​కు హాజరయ్యేందుకు ఆయన గురువారం సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

హైదరాబాద్​కు తేజస్వీ సూర్య

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూర్ ఎంపీ తేజస్వీ సూర్య గురువారం హైదరాబాద్​కు రానున్నారు. పార్టీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసే బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో కూడా తేజస్వీ సూర్య పాల్గొననున్నారు.