టీఆర్​ఎస్​కు ఆల్టర్నేటివ్​ మేమే..

టీఆర్​ఎస్​కు ఆల్టర్నేటివ్​ మేమే..
  • దుబ్బాకలో బీజేపీ క్యాండిడేట్​ను నిలబెడ్తం: కిషన్​రెడ్డి
  • జనం కోరుకుంటున్న తీర్పే వస్తుందనుకుంటున్నా
  • మా క్యాండిడేట్ రఘునందన్ రావే: జితేందర్ రెడ్డి  

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్​ను నిలబెడుతున్నామని, టీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్​గా బీజేపీ ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో ప్రజలు కోరుకుంటున్న తీర్పే వస్తుందని అనుకుంటున్నామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు, నీటి పంపిణీపై రెండు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ కలిసి చర్చించుకుంటే కేంద్రం మద్దతు ఇస్తుందని, వారి నిర్ణయాలకు ఆమోదం కూడా తెలుపుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో బీజేపీ బలపడాలని, టీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ పార్టీగా బీజేపీ ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున క్యాండిడేట్ ను నిలబెట్టనున్నట్లు ఆయన చెప్పారు. దుబ్బాకలో ప్రజలు కోరుకుంటున్న తీర్పే వస్తుందని అనుకుంటున్నామన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో దుబ్బాక ఉప ఎన్నికపై రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. పార్టీ అభ్యర్థి ఎంపికపై, ప్రచార తీరు, గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించారు. మీటింగ్ తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  దుబ్బాకలో ఇప్పటికే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరోసారి సమావేశమై ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తామన్నారు. ఈ ఎన్నికలకు పార్టీ తరపున కో ఆర్డినేటర్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఒక్కో ఇంచార్జ్ ఉంటారన్నారు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు మండల ఇంచార్జ్ లుగా బాధ్యతలు అప్పగించామన్నారు.

జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కండి..

జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా విపత్తు టైమ్ లో ప్రజలను బీజేపీనే ఆదుకున్నదని, టీఆర్ఎస్ సర్కార్ జనాన్ని గాలికొదిలేసిందని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి టీఆర్ఎస్ ను ప్రశ్నించాలని పబ్లిక్ కు చెప్పాలన్నారు. యాక్టివ్ గా ఉన్న వారిని బూత్ కమిటీ లో కి తీసుకొని పని చేయించాలని, బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలు, మోర్చా టీంలు గట్టిగా పని చేయాలని సూచించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ  గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ ఇంచార్జ్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక
ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావేనని, అయితే దీన్ని సెంట్రల్ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు దుబ్బాక ఎన్నికే నాంది కావాలన్నారు.

నీళ్లపై కేసీఆర్, జగన్ చర్చించుకోవాలె..   

ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు, నీటి పంపిణీపై రెండు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ కలిసి చర్చించుకుంటే కేంద్రం మద్దతు ఇస్తుందని, వారి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇద్దరు సీఎంలు కలిసి దావత్‌‌లు చేసుకుంటున్నప్పుడు, నీటి పంపిణీపై చర్చించుకుంటే తప్పేమిటన్నారు. గతంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే కేంద్రం మద్దతునిచ్చిందని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లోని అన్ని పార్టీలతో మాట్లాడి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగొద్దన్నదే కేంద్రం ఉద్దేశమన్నారు.