ఎలక్షన్లు అనగానే టీఆర్ఎస్ కు పూనకమొస్తది

ఎలక్షన్లు అనగానే టీఆర్ఎస్ కు పూనకమొస్తది
  • జూన్ నుంచే ఈ రూల్స్ అమల్లో ఉన్నయి..మద్దతు ధర తగ్గిందా?
  • రైతులకు పూర్తి స్వేచ్ఛఇవ్వడం, దళారుల్లేకుండాచేయడం తప్పా?
  • అవాస్తవాలతో జనాన్ని మోసం చేయొద్దని సూచన

హైదరాబాద్, వెలుగుఏవైనా ఎలక్షన్లు రాగానే టీఆర్ఎస్​కు పూనకం వస్తుందని, అడ్డగోలుగా ఆరోపణలకు దిగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన అగ్రికల్చర్​ చట్టాలపై విమర్శలు సరికాదని.. ఇలాంటి పూనకాలతో ప్రజలకు, రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. ‘‘2005లో కేంద్రంలో యూపీఏ సర్కారు, దానిలో టీఆర్ఎస్ భాగస్వామిగా ఉన్నప్పుడే.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రైవేటు మార్కెట్ యార్డులకు అనుమతినిస్తూ చట్టం తెచ్చింది. ఆనాడు దీనిపై మాట్లాడని టీఆర్ఎస్​కు.. అప్పుడు గుర్తుకురాని కార్పొరేట్ శక్తులు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయా?”అని నిలదీశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త చట్టంతో ప్రధాని మోడీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రాల్లో పర్యటించి, ప్రజలకు వాస్తవాలను వివరిస్తారని చెప్పారు. ఈ ఏడాది జూన్ 10 నుంచే ఆర్డినెన్స్ రూపంలో కొత్త అగ్రికల్చర్​ చట్టాలు అమలవుతున్నాయని, ఎక్కడైనా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) తగ్గిందా అని నిలదీశారు. తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ జరిగిందని, మరి ఎంఎస్పీ తగ్గిందా అని ప్రశ్నించారు. అంటే ఎవరిని ఎవరు మోసం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలు ఎంఎస్పీ కన్నా ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేశాయని.. మరి తెలంగాణ సర్కారు ఎప్పుడైనా అలా చేసిందా అని కిషన్​రెడ్డి నిలదీశారు. మోడీ సర్కారు వచ్చాక పంటలపై పరిస్థితులకు అనుగుణంగా 43 శాతం నుంచి 130 శాతం దాకా మద్దతు ధర పెంచిందని గుర్తు చేశారు.

దళారులకు దళారులుగా కొందరు నేతలు

రైతులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ.. వారు తమ ఉత్పత్తులను ఎలాంటి నిర్బంధాలు, పరిమితులు లేకుండా అమ్ముకునేలా కొత్త అగ్రికల్చర్​ చట్టాలు తెచ్చామని.. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మరికొన్ని పార్టీలు తెలుసుకోకుండా బూటకపు ప్రచారం చేస్తున్నాయని కిషన్​రెడ్డి మండిపడ్డారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే కాంగ్రెస్ పనా అని మండిపడ్డారు. కేంద్రం వంద రూపాయలు పంపిస్తే.. ప్రజలకు 15 రూపాయలే అందుతున్నాయని ఆనాడు మాజీ ప్రధాని రాజీవ్ అనే వారని, కానీ మోడీ పాలనలో వందకు వంద ప్రజల జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. ఆలుగడ్డలు భూమి లోపల పెరుగుతయా, భూమిపైన పెరుగుతయా కూడా తెలియని రాహుల్ గాంధీ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడడం హాస్యాస్పదని కామెంట్​ చేశారు. కొందరు నాయకులు దళారులకు దళారులుగా మారి ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లో కమ్యూనిస్టులకు జనం వాతలు పెడుతున్నా వాళ్లు వితండ వాదాన్ని విడిచిపెట్టడం లేదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతులకు అన్యాయం చేస్తున్నాయన్నారు.

సూచనలిస్తే తీసుకుంటం

కొత్త అగ్రికల్చర్​ చట్టంపై నిర్ణయాత్మక సూచనలు చేస్తే స్వీకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్​రెడ్డి చెప్పారు. ప్రతి పొలానికి నీళ్లు, ప్రతి చుక్క నీళ్లకు ఎక్కువ పంట, దళారీ వ్యవస్థ నిర్మూలన, రైతుల ఆదాయం రెట్టింపు, పంటకు తనే రేటు నిర్ణయించుకునే శక్తి వంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉన్నాయని వివరించారు. దీనివల్ల మద్దతు ధర రాకపోవడం, మార్కెట్ యార్డులు లేకపోవడం అనేది ఉండదని స్పష్టం చేశారు. దేశంలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగంలో కొత్త విధానాలను అవలంబించకపోతే భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పారు.

పేదలకు డబుల్ ఇండ్లు ఇంకెప్పుడు?

ముషీరాబాద్ (హైదరాబాద్), వెలుగు: రాష్ట్రంలో పేదలకు డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రశ్నించారు. శంకుస్థాపన చేసి ఐదేండ్లు దాటినా ఇంకా కడుతూనే ఉండటం ఏమిటని, ఇది టీఆర్ఎస్​ సర్కారు చేతకాని తనమేనని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్​లోని ముషీరాబాద్ నియోజకవర్గం సాయిచరణ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓబీసీ మోర్చా జాతీయ చీఫ్​కె.లక్ష్మణ్ తో కలిసి పరిశీలించారు. ఈ టైంలో చాలా మంది లబ్ధిదారులు అక్కడికి చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు ఇండ్లు ఎప్పుడు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కిషన్​రెడ్డి, లక్ష్మణ్​ త్వరగా డబుల్​ ఇండ్లు పూర్తిచేసి ఇచ్చేలా రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచుతామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఇండ్ల కోసం ఇచ్చిన నిధులను టీఆర్ఎస్ సర్కారు పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. కేంద్ర నిధులతో ఏపీలో ఏకంగా ఏడు లక్షల ఇండ్లను పూర్తిచేశారని తెలిపారు. హైదరాబాద్ లో 20 లక్షల మందికి ఇండ్లు లేవన్నారు. టీఆర్ఎస్​కు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు రాగానే డబుల్ బెడ్రూం ఇండ్లు గుర్తుకొస్తున్నాయని, ఎన్నికలు కాగానే పట్టించుకోవడం లేదని కె.లక్ష్మణ్​మండిపడ్డారు.