
హైదరాబాద్, వెలుగు: “గవర్నర్ ఎవరిపైనా విమర్శలు చేయలేదు. ఆమె వృత్తిపరంగా డాక్టర్.. కాబట్టి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నది వాస్తవం” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కారుతో పాటు ప్రజలకూ ఆమె సలహాలు సూచనలు ఇస్తున్నారని, ఆమె మాటలతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అన్ని రాష్ర్ట ప్రభుత్వాలతో కేంద్రానికి మంచి సంబంధాలున్నాయన్నారు. ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు . ఎర్రగడ్డ ఈఎస్ ఐ ఆస్పత్రికి వెళ్లారు . అమీర్ పేటలోని చల్లా హాస్పిటల్లో రోటరీ ప్లాస్ మా బ్యాం క్ కు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రికవరీ రేటు బాగానే ఉన్నా, టెస్టుల సంఖ్య పెరగాల్సిన అవసరముందని, టెస్టుల పెంచాలన్న విషయాన్ని ప్రధాని మోడీ కూడా చెప్పారని గుర్తుచేశారు.
కరోనా మందు ఎప్పుడొస్తదో తెలియదు
కరోనాకు ఇంకా ఎలాంటి మందు రాలేదని, ఎప్పుడొస్తుందో కూడా తెలియదని కిషన్ రెడ్డి అన్నారు. అప్పటివరకు ఎవరిని వారు రక్షించుకుంటూ పక్క వారినీ రక్షించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా రోటరీ ప్లాస్ మా బ్యాంక్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్లాస్ మా డొనేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను అభినందిస్తున్నట్టు చెప్పారు. ప్రజల్ని మరింత చైతన్య పరిచేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. కరోనాతో అగ్రదేశాలే విలవిలలాడుతున్నాయని, కానీ, ఇక్కడ ప్రధాని మోడీ తీసుకున్న చర్యలతో ఎక్కువగా ప్రాణనష్టం జరగలేదని కిషన్ రెడ్డి అన్నారు.
ఓబీసీ జనాభా లెక్కలు చేపట్టాలి
2021సెన్సెస్‌లో ఓబీసీ జనాభా లెక్కలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కోరింది. రాష్ట్ర సర్కార్ గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించి న బీసీ జనాభా లెక్కలకు ఆథరైజేషన్ కోసం ఆదేశాలు ఇవ్వాలంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు. తరువాత ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ యూపీఎస్సీ నియామకాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ కు పద్మ విభూషణ్ అవార్డ్ ఇవ్వాలని కోరగా.. అందుకు ప్రయత్నిస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.