రైస్ మిల్లుల్లో అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలె

రైస్ మిల్లుల్లో అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలె

రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరిగాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎఫ్సీఐ అధికారులు 40 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయగా.. 4,53,890 సంచుల బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అవి ఎలా మాయమయ్యాయో కేసీఆర్ సర్కారు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాయమైన బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. తక్కువైన ధాన్యంపై ప్రభుత్వాన్ని అలర్ట్ చేశామని.. రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఘర్షణ వాతావరణం సృష్టించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సర్కారు ఇప్పటి వరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని విమర్శించారు. బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తేలేదని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిందని, అయినా కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ప్రధానిని తిడుతూ దేశం నుంచి తరిమికొడతామని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

కేసీఆర్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో ఆడుకుంటోందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 40లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ ఇస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని, అయితే ధాన్యం సేకరణకు రాష్ట్రంలో అసలు గోనె సంచులే లేవని చెప్పారు. ప్రస్తుతం వడ్ల కోసం15కోట్ల గోనె సంచులు అవసరమన్న ఆయన.. జనవరి నుంచి వాటి కొనుగోలు మొదలుపెట్టాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు. అసలు గోనె సంచులే లేనప్పుడు తండ్రీ కొడుకులు వడ్లను తట్టలో తీసుకొస్తరా అని సటైర్ విసిరారు.