తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఉద్యమం తప్పదు: కిషన్ రెడ్డి

తెలంగాణను రక్షించుకునేందుకు మరో ఉద్యమం తప్పదు: కిషన్ రెడ్డి

జనగామ: మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.  మే 23వ తేదీ గురువారం జిల్లా కేంద్రంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ అంధకారంలో ఉండే అవకాశం ఉందన్నారు. తెలంగాణను రక్షించుకొనేందుకు మరో ఉద్యమం తప్పదన్నారు. 

తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యిలో పడ్డట్టయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. నిజాం రాజ్యం లాగా బీఆర్ఎస్ పరిపాలన చేసిందని.. కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏలు రెండు ఒకటేనని చెప్పారు. వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని  దుయ్యబట్టారు.

100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆగస్టు వరకు వాయిదా వేశారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. క్వింటాలు ధాన్యంపై రూ.500 ఇస్తామని సన్నరకం ధాన్యానికి ఇస్తామంటూ రైతులను మోసం చేశారన్నారు. బోనస్ నుండి తప్పించుకుని రైతులకు అన్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని  ప్రశ్నించాలంటే.. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డిని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.