భారత ఆర్థిక వ్యవస్థ బాగుంది:దేశం నిస్సహాయ స్థితిలో లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారత ఆర్థిక వ్యవస్థ బాగుంది:దేశం నిస్సహాయ స్థితిలో లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • రాహుల్ అసత్యాలు చెప్తూ.. ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: దేశం ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో లేదని.. భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ, అత్యున్నత స్థాయి సంస్థలపై అసత్య ప్రచారంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అన్ని షాక్ అబ్జార్బర్‌‌‌‌లను (ఆటంకపరిచే వ్యవస్థలను) తొలగించడం వల్ల భారత్ "ఆర్థిక సునామీ" వైపు వెళుతోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.

రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న అసత్యపు వాదన నిరాధారమైందని శుక్రవారం కిషన్​రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇలాంటి ఆరోపణలు దేశ ప్రజలలో లేని భయాందోళనలను రెచ్చగొట్టడమేనని అభిప్రాయపడ్డారు. 

ఒకవేళ దేశపు ఆర్థిక వ్యవస్థ షాక్ అబ్జార్బర్‌‌‌‌లను నిజంగానే తొలగించి ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతంగా పెరిగిన ముడి చమురు ధరలు, పశ్చిమాసియాలో సంఘర్షణ, దిగుమతులు, ఎగుమతులపై సప్లై చైన్ లో అంతరాయాలు, ఆర్థికంగా ప్రపంచం అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, నిరంతర భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు నిలకడగా కొనసాగుతోందో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

‘నిజానికి భారత్ ఒక బాహ్య ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కానీ, నిస్సహాయ స్థితిలో లేదు. ప్రభుత్వం ఏ రకమైన షాక్ అబ్జార్బర్‌‌‌‌లను తొలగించలేదు. 140 కోట్ల ప్రజల సహకారంతో గత దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేశారు’ అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.