షెడ్యూల్ ఇదే: 16 నుంచి  రాష్ట్రంలో కిషన్ రెడ్డి టూర్

షెడ్యూల్ ఇదే: 16 నుంచి  రాష్ట్రంలో కిషన్ రెడ్డి టూర్
  • ఈ నెల16 నుంచి 20 వరకు  రాష్ట్రంలో కిషన్ రెడ్డి టూర్
  • నాలుగు రోజులపాటు ఆశీర్వాద యాత్ర

హైదరాబాద్, వెలుగు: కేంద్ర కేబినెట్ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఆశీర్వాద యాత్ర పేరుతో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. కిషన్ రెడ్డి టూర్​ను సక్సెస్  చేసేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల16 నుంచి 20 వరకు రాష్ట్రంలో ఆయన పర్యటించనుండడంతో గురువారం రాత్రి బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, ఆఫీసు బేరర్లు కొందరు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. కిషన్ రెడ్డి టూర్ సందర్భంగా స్వాగత కార్యక్రమాలు, సభలు, బైక్ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలంటూ పార్టీ పెద్దలు ఆయా జిల్లాల పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కరోనా రూల్స్ పాటిస్తూనే ఈ ప్రోగ్రామ్​లు నిర్వహించాలని పార్టీ నాయకులు, క్యాడర్​కు ఆదేశాలిచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వనజీవి రామయ్య, చేనేత కార్మికుడు చింతకింది మల్లేశంను కూడా ఈ టూర్​లో కిషన్ రెడ్డి కలుసుకోనున్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ విస్తరణ తర్వాత.. కేంద్ర మంత్రులు తమ నియోజకవర్గాల్లో పర్యటించే ముందు ఆశీర్వాద యాత్ర పేరుతో సొంత రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. పేదలు, ఇతర వర్గాల వారి కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ యాత్రలో ప్రజలకు వివరించాలని సూచించింది. 
కిషన్ రెడ్డి టూర్ సాగేది ఇలా.. 
కిషన్ రెడ్డి ఈ నెల 15న ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేయనున్నారు. మరునాడు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుని, మధ్యాహ్నం విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటారు. సాయంత్రం 6.30కు సూర్యాపేట జిల్లా కోదాడ చేరుకుని, అక్కడి నుంచి ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. రాత్రి 8 గంటలకు ఖమ్మం చేరుకుని, అక్కడే బస చేస్తారు. 17న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12కు నర్సంపేట, 3 గంటలకు ములుగుకు చేరుకుంటారు. సాయంత్రం 4కు రామప్ప గుడిని సందర్శిస్తారు. రాత్రి వరంగల్ చేరుకుని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 18న ఉదయం 9 గంటలకు జనగామ, 10.45కు యాదగిరిగుట్ట, 12.30కు భువనగిరి, 2 గంటలకు ఘట్కేసర్, 4.30కు ఉప్పల్ చేరుకుంటారు. రాత్రి 8కి బీజేపీ స్టేట్ ఆఫీసుకు చేరుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారు. 19, 20వ తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో యాత్ర కొనసగించనున్నారు.