
- ఈస్ట్ జోన్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్
కోల్‌కతా: ఇండియా పేసర్ ఆకాశ్ దీప్, కీపర్ ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నారు. ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఈ టోర్నీ మ్యాచ్‌లు ఈ నెల 28 నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) గ్రౌండ్‌లో జరగనున్నాయి. ఇంగ్లండ్ టూర్‌లో వెన్ను నొప్పికి గురైన ఆకాశ్ దీప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. డాక్లర్ల సలహా మేరకు అతడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని జోనల్ సెలెక్షన్ కమిటీకి సమాచారం అందించాడు.
అతని స్థానంలో బీహార్‌కు చెందిన ముఖ్తార్ హుస్సేన్‌ను ఈస్ట్ జోన్ జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌కు బైక్ యాక్సిడెంట్‌లో చేతికి గాయమైంది. ఈ గాయం తీవ్రమైనది కానప్పటికీ ముందుజాగ్రత్తగా అతనికి విశ్రాంతి సూచించారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా– ఎ జట్టుతో జరిగే మ్యాచ్‌ల నాటికి ఇషాన్ తిరిగి ఫిట్‌నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. ఇషాన్ కిషన్ లేకపోవడంతో బెంగాల్ టాపార్డర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అస్సాం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. ఇషాన్ స్థానంలో ఒడిశాకు చెందిన ఆశీర్వాద్ స్వైన్ జట్టులోకి వచ్చాడు.