కిచెన్ తెలంగాణ : వెరైటీ అండ్ హెల్దీ 

కిచెన్ తెలంగాణ : వెరైటీ అండ్ హెల్దీ 

మాన్​సూన్​ వస్తే వేడి వేడిగా పునుగులు, బజ్జీలు, సమోసాలు తినాలనిపిస్తుంది. వాటితోపాటు ఒక కప్పు టీ లేదా కాఫీ కావాలనిపిస్తుంది. ఇవన్నీ రెగ్యులర్​గా ఉండేవే... ఇవి కాకుండా వెరైటీగా ఏమన్నా తింటే బాగుండు అనిపిస్తుందా? అయితే ఈ వెరైటీలు ట్రై చేయొచ్చు. టేస్టీ అండ్​ హెల్దీ కూడా. 

బనానా అడ

కావాల్సినవి :

అరటి పండ్లు – ఏడు

బియ్యప్పిండి – అర కప్పు

జీడిపప్పు, ఎండుద్రాక్ష – ఒక్కోటి పదిహేను చొప్పున

చక్కెర – నాలుగు టేబుల్ స్పూన్లు

యాలకులు – నాలుగు

నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు

తయారీ : పాన్​లో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్ష, కొబ్బరి తురుము ఒక్కోటిగా వేగించాలి. ఇవన్నీ బాగా వేగాక, చక్కెర కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి, వేడిచేయాలి. అరటి పళ్లను కడిగి, తొక్కతీయకుండా ఇడ్లీ ప్లేట్​లో పెట్టాలి. ఆ ప్లేట్​ని ఇడ్లీ పాత్రలో ఉంచి మూతపెట్టి ఉడికించాలి. తర్వాత వాటిని వేరే ప్లేట్​లోకి తీసి, వాటి తొక్క వలవాలి. తొక్కతోపాటు అరటిపండు లోపల ఉన్న విత్తనాలను కూడా తీసేయొచ్చు. ఆ తర్వాత అరటిపండ్లను మెత్తగా మెదిపి, అందులో బియ్యప్పిండి వేసి చపాతీ పిండిలా కలపాలి. ఆ పిండిని చిన్న ఉండలు చేసి, వాటిని చపాతీల్లా వత్తాలి. ఒక చపాతీ మీద తయారుచేసిన మిశ్రమం పరిచి దాని మీద మరొక చపాతీ పెట్టాలి. ఇలా కేక్​లా మూడు లేయర్స్​ వేయాలి. ఆ తర్వాత వాటిని మరోసారి ఇడ్లీ పాత్రలో ఉడికించాలి. 

పాల్ పాతిరి

కావాల్సినవి :

బియ్యం – రెండు కప్పులు

బొంబాయి రవ్వ – అర కప్పు

చక్కెర – ఒక టీస్పూన్

ఉప్పు, నూనె – సరిపడా

తయారీ : బియ్యాన్ని మూడు సార్లు కడగాలి. తర్వాత నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టాలి. నానిన బియ్యాన్ని మిక్సీజార్​లో మెత్తగా గ్రైండ్​ చేయాలి. అందులో బొంబాయి రవ్వ, ఉప్పు, చక్కెర వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉడికించాలి. ఉడికేటప్పుడు ఉండలు కట్టకుండా మిశ్రమం గట్టిపడేవరకు తిప్పుతుండాలి. మిశ్రమం గట్టిపడ్డాక మూత పెట్టి కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి చపాతీ పిండిలా కలపాలి. మూత పెట్టి మరికాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఆ పిండితో చిన్న ఉండలు చేసి పూరీల్లా వత్తాలి. అయితే పూరీ వత్తేటప్పుడు పొడి పిండి వాడకూడదు. వాటిని వేడి నూనెలో వేసి, పొంగేవరకు వేగిస్తే పాల్ పాతిరి రెడీ. వీటిని రైస్​ పూరీ అని కూడా అనొచ్చు. చిక్కటి కొబ్బరి పాలలో చక్కెర కలిపి, అందులో ఈ పూరీలను ముంచుకుని తింటే టేస్టీగా ఉంటుంది.

రాగి సూప్

కావాల్సినవి :  

రాగి పిండి – మూడు టేబుల్ స్పూన్లు

క్యారెట్ – ఒకటి,

పచ్చిబటానీలు – పావు కప్పు

చిన్న ఉల్లిపాయలు – ఐదు

పచ్చిమిర్చి – ఒకటి

వెల్లుల్లి రెబ్బలు – రెండు

అల్లం – చిన్నముక్క

బీన్స్ తరుగు – అర కప్పు

నువ్వుల నూనె – రెండు టేబుల్ స్పూన్లు

జీలకర్ర, మిరియాలు – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున

ఉప్పు – సరిపడా

పసుపు – చిటికెడు

తయారీ : చిన్న ఉల్లిగడ్డల్ని నిలువుగా తరిగి వేడి నూనెలో వేయాలి. దాంతోపాటు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బల తరుగు, అల్లం తురుము వేసి వేగించాలి. ఆ తర్వాత క్యారెట్​ తరుగు, పచ్చి బటానీలు, మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. కావాలంటే ఇందులో క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ వంటివి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఒక గిన్నెలో రాగి పిండి వేసి నిండా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా పాన్​లో పోసి కలపాలి. 
మూత పెట్టి మరికాసేపు ఉడికిస్తే రాగి సూప్ రెడీ. 

వెజ్ సూప్

కావాల్సినవి : 

సొరకాయ (చిన్నది), బీరకాయ – ఒక్కోటి 

వెన్న, జీలకర్ర, మిరియాలు – ఒక్కో టీస్పూన్ చొప్పున

ఇంగువ – అర టీస్పూన్

ఉప్పు, నీళ్లు – సరిపడా, కొత్తిమీర కొంచెం

తయారీ : సొరకాయ, బీరకాయ కడిగి, వాటిపైన తొక్కు తీయాలి. తర్వాత వాటిని తరిగి ప్రెజర్​ కుక్కర్​లో వేయాలి. అందులో నీళ్లు పోసి పది నిమిషాలు ఉడికించాలి. తరువాత మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్​లో వెన్న వేడి చేసి అందులో ఇంగువ, జీలకర్ర వేగించాలి. అందులో గ్రైండ్ చేసిన సొరకాయ, బీరకాయ మిశ్రమంతోపాటు ఉప్పు కూడా వేసి కలపాలి. ఆపై మిరియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లుకుంటే సూప్ సూపర్​గా ఉంటుంది.

 మష్రూమ్​ సూప్

కావాల్సినవి : 

మష్రూమ్స్​ – పది

నూనె – ఒక టేబుల్ స్పూన్

వెన్న – రెండు టేబుల్ స్పూన్లు

ఉల్లిగడ్డ – ఒకటి

అల్లం వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూన్

మైదా – ఒక టీస్పూన్

ఉప్పు, నీళ్లు – సరిపడా

మిరియాల పొడి – అర టీస్పూన్

తయారీ : పాన్​లో నూనె, వెన్న వేడిచేయాలి. తర్వాత ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. అందులో మష్రూమ్స్ తరుగు వేయాలి. అందులో మైదా వేసి ఒకసారి కలిపాక నీళ్లు పోయాలి. మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ మిశ్రమంలో నుంచి ఒక టేబుల్ స్పూన్ పక్కకు తీసి మిక్సీజార్​లో వేసి గ్రైండ్​ చేయాలి. తరువాత దాన్ని ఉడుకుతున్న మిశ్రమంలో పోయాలి. మరికాసేపు సన్నటిమంట మీద ఉడికించి మిరియాల పొడి చల్లుకుని తాగితే టేస్టీగా ఉంటుంది.